
రాజీనామా దిశగా ఎమ్మెల్యే రోజా..? నగరిలో ఏం జరుగుతోంది..!!
వైఎస్సార్సీపీ ఫైర్ బ్రాండ్ నేత, నటి, నగరి ఎమ్మెల్యే రోజాకు వైఎస్సార్సీపీలో షాక్ మీద షాక్ తగులుతోంది. ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీలో నామినేటెడ్ పదవుల భర్తీ రోజాకు తలనొప్పిగా తయారైంది. రోజా సొంత నియోజకవర్గమైన నగరిలో ఆమె ప్రత్యర్థులకు జగన్ ప్రాధాన్యత ఇవ్వడంతో రోజా తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. నగరి నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల తీరుతో పాటు, నామినేటెడ్ పదవుల్లో వారికి ప్రాధాన్యత దక్కటంతో రోజా నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు సమాచారం.

రోజాకు సొంత పార్టీ నేతల వరుస షాకులు
గతంలో రోజాకు గట్టి ప్రత్యర్థి అయిన నగరి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కెజి కుమార్, ఆయన భార్య శాంతికి ఈడిగ కుల కార్పొరేషన్ చైర్‌పర్సన్ పదవిని కట్టబెట్టారు.అప్పుడే రోజా తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇక తాజాగా నిండ్ర మండల పరిషత్ ఎన్నికల్లో రోజా శిబిరానికి గట్టిపోటీనిచ్చిన రెడ్డివారి చక్రపాణి రెడ్డి కి తాజాగా శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్‌పర్సన్ పదవిని కట్టబెట్టారు. ఈ నెల 3వ తేదీన శ్రీశైల దేవస్థానం పాలకమండలి నియమించిన రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం ఆలయ పాలకమండలి లో నగరికి చెందిన రెడ్డివారి చక్రపాణి రెడ్డి కి అవకాశం ఇచ్చింది.

శ్రీశైలం ఆలయ బోర్డ్ చైర్మన్ గా రోజా ప్రత్యర్ధి చక్రపాణి రెడ్డికి అవకాశం
ఏపీలోని ప్రతిష్టాత్మక ఆలయ బోర్డు చైర్‌పర్సన్‌గా చక్రపాణి రెడ్డిని జగన్ నియమించారని తెలిసి రోజా షాక్ అయ్యారు. వైఎస్‌ఆర్‌సిపి అగ్రనాయకత్వం నుంచి నామినేటెడ్ పదవులు దక్కించుకోవడం ద్వారా రోజా ప్రత్యర్థులు రోజా పై పైచేయి సాధించడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు అన్నది అర్థమౌతుంది. రోజా ప్రత్యర్థులు నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఆమెకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ పరిస్థితి రోజాకు రాజకీయంగా మింగుడు పడటం లేదు .

జగన్ తోనే తేల్చుకుంటా అంటున్న రోజా... అవసరమైతే రాజీనామా చేస్తానని చెప్పినట్టు ప్రచారం
2021 జూలైలో జగన్‌ను ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా తొలగించడంతో వైఎస్‌ఆర్‌సీపీలో రోజాకు గడ్డుకాలం మొదలైంది. ఆమె ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ ఆమెకు ఎలాంటి పదవీ లేకపోవటంతో రోజా ఇబ్బంది పడుతున్నారు . ఆమె స్థానంలో మెట్టు గోవిందారెడ్డిని ఏపీఐఐసీ చైర్మన్‌గా జగన్ ప్రతిపాదించారు. రోజాకు ఇప్పటి వరకు కేబినెట్ లో స్థానం దక్కిన పరిస్థితి కూడా లేదు.
మరోవైపు రోజా ప్రత్యర్థి వర్గాలకు పదవులు దక్కుతున్న తీరుతో రోజా తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారని సమాచారం. ఇక ఈ వ్యవహారంలో సీఎం జగన్మోహన్ రెడ్డితోనే తాడోపేడో తేల్చుకుంటామని, అవసరమైతే రాజీనామా చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని రోజా చెప్పారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

నగరి నియోజకవర్గంలో స్వపక్షం లోనే ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటున్న రోజా
నగరిలో ఎమ్మెల్యే రోజాకు చక్రపాణిరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఇద్దరు నేతలు నేరుగా బాహాటంగా వాదులాడుకున్నారు. నగరిలో పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దల దృష్టికి తీసుకొనిపోయిన రోజా చక్రపాణి రెడ్డి పై ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా చక్రపాణి రెడ్డి కి శ్రీశైల ఆలయ బోర్డు చైర్మన్ గా అవకాశం కల్పించడం రోజా కు ఏమాత్రం రుచించడం లేదు. మొత్తానికి నగరి నియోజకవర్గంలో స్వపక్షం లోనే ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్యే రోజా.