భూముల మార్కెట్ ధరలపై శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. సామాన్యుల కోసం ప్రభుత్వ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ లోని జగన్ సర్కార్ భూముల ధరల విషయంలో ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది భూముల మార్కెట్ ధరలు పెంచకూడదని నిర్ణయం తీసుకుని సామాన్యులకు ఊరటనిచ్చింది. భూముల మార్కెట్ ధరల అంశంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యులకు తీపికబురుగా మారింది.
ప్రతిఏటా ఆగస్టు ఒకటవ తేదీన భూముల ధరలను ప్రభుత్వం పెంచుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది కూడా ఆగస్టు 1 నుండి భూముల ధరలు పెంచాలని మొదట భావించినా, వివిధ వర్గాల నుండి సాధారణ ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ ఏడాది భూముల మార్కెట్ ధరల పెంపుకు బ్రేక్ వేసింది ఏపీ సర్కార్. కరోనా కారణంగా భూముల మార్కెట్ ధరలను పెంచడం లేదని వెల్లడించింది.

కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒకింత ఊరట నిచ్చింది. ఎవరైనా భూములు కొనుగోలు చేయాలనుకుంటే ఇది సరైన సమయం అని రియల్టర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. భూములపై ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పిందని రియల్టర్లు చెప్తున్నారు.
Recommended Video
ఇక గతేడాది ఆగస్టులో ఏపీ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో భూముల ధరలు 10 శాతం నుండి 30 శాతం వరకు పెంచింది. విజయవాడ, గుంటూరు నగరాల్లో 10 శాతం విశాఖపట్నంలో 25% అనంతపురం లో 30 శాతం మేర భూముల మార్కెట్ ధరలను పెంచినట్లుగా సమాచారం. భూముల మార్కెట్ ధరలు పెంచడం వల్ల గత ఏడాది సుమారు ఎనిమిది వందల కోట్ల మేర ఆదాయం వచ్చినట్లుగా అంచనా వేస్తున్నారు. కానీ ఈ ఏడాది మాత్రం కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల మార్కెట్ ధరలను పెంచకుండా ప్రజలను దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications