మంచి ఉద్దేశ్యంతోనే...: చంద్రబాబు వెంట జైరాం రమేష్
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రధాని నరేంద్ర మోడీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, హోం మంత్రి రాజ్‌నాథ్ మినహా చంద్రబాబు కలిసిన కేంద్రమంత్రులు అందరి వద్దకూ కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర విభజన వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన జైరాం రమేశ్ వెళ్లారు. భేటీల్లో పాల్గొన్నారు.
ఆయా మంత్రుల శాఖలకు సంబంధించి విభజన సందర్భంగా ఏమేం హామీలు ఇచ్చామో, వాటి ఉద్దేశాలు ఏమిటో, వాటి వెనుక ఉన్న ప్రాతిపదిక ఏమిటో వివరించారు. దీంతో, విభజనకు కారణమైన జైరామ్ రమేశ్ మీతోపాటు ఎందుకు వచ్చాడని చంద్రబాబును విలేకరులు ప్రశ్నించారు.

కాంగ్రెస్ అధిష్ఠానం విభజన చేయమంటేనే ఆయన చేశాడని, వ్యక్తి ఆయనే అయినా ఆయనకు ఆదేశాలు జారీ చేసింది మాత్రం కాంగ్రెస్ అధిష్టానమని, ఇప్పుడు మాత్రం మంచి ఉద్దేశంతో, గతంలో ఏం జరిగిందో వివరించేందుకే ఆయన మాతోపాటు వచ్చి ఆయా మంత్రులకు వివరిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. మీడియాతో మాట్లాడేందుకు జైరామ్ రమేశ్ నిరాకరించారు.
కాగా, చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు ఉమా భారతి, స్మృతి ఇరానీ, రాజ్ నాథ్ సింగ్ తదితరులను ఉదయం నుండి సాయంత్రం వరకు కలిసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications