జనసేన ఆవిర్భావ వేడుకలకు రంగం సిద్ధం.. భారీ సభకు ప్లాన్
ప్రజాస్వామ్యంలో ప్రజలు బాగుపడాలంటే రాజకీయ జవాబుదారీతనం కావాలి అని, ప్రజా సమస్యల కోసం ప్రశ్నించడానికి నటుడు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన పార్టీ జనసేన పార్టీ. 2014 మార్చి 14వ తేదీన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. అప్పటినుండి ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. గత ఎన్నికలలో ఓటమిపాలైనప్పటికీ, ప్రజా సమస్యల కోసం పోరాటంలో తాము వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పి మరీ ముందుకు సాగుతున్నారు. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుంటూ, జనసేన సాగించిన ప్రయాణంలో మరో మైలు రాయిని చేరబోతోంది.
ఈ నేపథ్యంలో మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించడం కోసం జనసేన పార్టీ రంగం సిద్ధం చేస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించడానికి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మంగళగిరి మండలం లో జాతీయ రహదారి పక్కనే ఉన్న రెండు స్థలాలను జన సేన ఆవిర్భావ వేడుకలు సందర్భంగా సభను నిర్వహించడానికి జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఇప్పటికే పరిశీలించినట్లు సమాచారం.

మంగళగిరి మండలం లోని కాజా టోల్ గేట్ సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ స్థిరాస్థి సంస్థకు చెందిన స్థలాన్ని, డిజిపి కార్యాలయం ఎదురుగా ఉన్న మరో స్థలాన్ని జనసేన చేనేత విభాగం అధ్యక్షులు చిల్లపల్లి శ్రీనివాసులు, కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు లతో కలిసి నాదెండ్ల మనోహర్ పరిశీలించి నట్టుగా సమాచారం. అయితే కాజ దగ్గరగా ఉన్న స్థలమే సభ ఏర్పాటుకు అనువుగా ఉంటుందని వారు భావిస్తున్నారు.
జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని భారీ ఎత్తున సభ నిర్వహించాలని భావిస్తున్నారు.సుమారు లక్ష మందికి పైగా జనసేన కార్యకర్తలు ఈ సభకు హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో మళ్లీ జనసేన నేతలలో నూతన ఉత్సాహం నింపేందుకు, దిశానిర్దేశం చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications