జమిలి ఎన్నికలపై జనసేన స్టాండ్ ఇదే ! కేంద్ర పెద్దలకు తేల్చేసిన పవన్ !
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. కేంద్రం ఈ నెలలో జరిగే పార్లమెంట్ ప్రత్యేక భేటీలో ఈ మేరకు జమిలి ఎన్నికల బిల్లు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో ఏపీలో బీజేపీ మిత్రపక్షమైన జనసేన పార్టీ తమ స్టాండ్ ఏంటో చెప్పేసింది. జమిలి ఎన్నికలపై ఇప్పటికే బీజేపీ పెద్దలతో తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లు జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఒకే దేశం-ఒకే ఎన్నికల నినాదంతో కేంద్రం తీసుకుంటున్న చర్యలకు తమ పార్టీ మద్దతు ఉంటుందని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇవాళ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జమిలి ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో జమిలి ఎన్నికలపై చర్చించారన్నారు. కాబట్టి తాము వన్ నేషన్-వన్ ఎలక్షన్‌ను సమర్ధిస్తుందన్నారు. ఈ అంశంపై లోతైన చర్చ జరగాలని కూడా కోరారు.

జమిలి ఎన్నికల ద్వారా దేశంలో ప్రజాధనం ఆదా అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. పార్లమెంటులోనూ జమిలి ఎన్నికలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల దేశానికి కూడా మంచి జరుగుతుందన్నారు. వాస్తవానికి జమిలి ఎన్నికలపై ఎప్పటి నుంచో దేశంలో చర్చ జరుగుతోందని, ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ దాన్ని బలంగా ముందుకు తీసుకొచ్చిందన్నారు.
మరోవైపు జమిలి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఏపీ రాజకీయాలపైనా నాదెండ్ల స్పందించారు. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల ద్వారా ఏపీలో కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామన్నారు.
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలని భావిస్తున్నామని నాదెండ్ల తెలిపారు. సెప్టెంబర్‌లోనే పవన్ కళ్యాణ్ మలి విడత వారాహి యాత్ర ఉంటుందన్నారు. త్వరలో దీని కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అలాగే ఏపీలో పొత్తులపైనా పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారని నాదెండ్ల తెలిపారు.












Click it and Unblock the Notifications