నాకూ, వైసీపీకి అదే తేడా: పవన్ కల్యాణ్
నేరగాళ్లు రాజకీయాలు చేస్తే రాష్ట్రం నాశనమవుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలులో జనసేన పార్టీ నాయకులతో కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ వైసీపీ నాయకులు పులివెందుల సంస్కృతిని అన్ని చోట్లకు తెచ్చారని, నేరగాళ్ల బెదిరింపులకు మంచివాళ్లు కూడా లొంగిపోతారన్నారు.
వైసీపీ చేసినట్లు తాను కుల రాజకీయాలు చేయలేనని, విభిన్న కులాలు, విభిన్న మతాల నుంచి జనసేన సభ్యులను తీసుకున్నట్లు వెల్లడించారు. తమ పార్టీ ఓడిన తర్వాత కూడా నిలదొక్కుకోవడమే గొప్ప విషయమని, ప్రజలకు జనసేన భావజాలం, జనసేన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాజకీయ పదవుల్లో మూడోవంతు మహిళలు ఉండాలని, ప్రజల హక్కులకు భంగం కలిగితే పోరాడతానన్నారు. అవసరమైతే తానే ఎదురు తిరుగుతానని, రూ.200 లంచం తీసుకున్న ఉద్యోగికి శిక్ష పడుతుందని, రూ.వేల కోట్లు దోపిడీ చేసే నాయకులు పరిపాలన చేస్తున్నారన్నారు. ఓట్లు తీసేస్తారని, దొంగ ఓట్లు వేస్తారని, మన ఓటుతో గెలిచి జవాబుదారీతనం లేకపోతే కుదరదన్నారు. గోదావరి జిల్లాల నుంచే మార్పు మొదలు కావాలన్నారు.

అందుకే తాను ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపై దృష్టిసారించానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల నుంచి వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదన్నారు. అందుకు తగ్గట్లుగా తమ ప్రణాళిక ఉంటుందన్నారు. గత ఎన్నికల్లో రాజోలులో వెలిగిన చిరు ద్వీపం.. తాజాగా ఉమ్మడి కడప జిల్లా రాజంపేట దాకా వెలుగుతోందన్నారు. అర్థనారీశ్వరి తత్వం అంటూ మనం మహిళల్ని గౌరవిస్తామని, కానీ రాజకీయాల్లో వాళ్లకు మూడోవంతు కూడా ఇవ్వలేకపోతున్నామన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో జనసేన ముంటుందని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications