జనసేన చేనేత వికాస విభాగం ఏర్పాటు ; తాను చేనేత బ్రాండ్ అంబాసిడర్ అన్న పవన్ కళ్యాణ్
ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రముఖులు నేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొదటి నుండి చేనేత పట్ల తన మక్కువను తెలియజేస్తూ, చేనేత వస్త్రాలను ధరించే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేయటంతో పాటు జనసేన నేత కార్మిక వికాసానికి కృషి చేస్తుందని స్పష్టం చేశారు. అంతేకాదు చేనేత రంగాన్ని ఆదరించాలని, చేనేత ధరించాలని, చేనేత కార్మికులను ప్రోత్సహించాలని, భారతీయ చేనేత కళారంగాన్ని కాపాడుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

జనసేన చేనేత వికాస విభాగం ఏర్పాటు చేశామన్న పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేనేత రంగ అభివృద్ధికి జనసేన కూడా ఇతోధికంగా కృషి చేస్తుంది అని చెబుతూ ఇందులో భాగంగా జనసేన చేనేత వికాస విభాగం ఏర్పాటు చేశామని వెల్లడించారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి, చేనేత రంగ వికాసానికి తాము కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ప్రకటనలో ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన భారత దేశానికి కీర్తిప్రతిష్ఠలు తెచ్చిన కళారంగం చేనేత అని అభివర్ణించారు. భారతీయ కళల గురించి మాట్లాడాలి అనుకుంటే ముందుగా మాట్లాడాల్సింది చేనేత కళా రంగం గురించే అంటూ చేనేత గొప్పతనాన్ని ఆయన స్పష్టం చేశారు.

దేశ స్వాతంత్రోద్యమం కూడా చేనేత ఆలంబనగానే సాగిందన్న జనసేనాని
మన కళాకారుల శైలి నైపుణ్యం మన దేశానికి అంతటి కీర్తిని సంపాదించిపెట్టింది అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మన దేశ స్వాతంత్ర ఉద్యమం కూడా చేనేత ఆలంబనగానే స్వదేశీ ఉద్యమ రూపంలో కొనసాగిందని గుర్తుచేశారు. మన దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తుంది చేనేత రంగం అని పేర్కొన్న ఆయన ముఖ్యంగా చేనేత రంగంలో మహిళలు ప్రధాన భూమిక పోషిస్తున్న సంగతి మనం కాదనలేని నిజం అంటూ స్పష్టం చేశారు. స్వదేశంలో, విదేశాల్లోనూ చేనేత ఉత్పత్తుల అమ్మకాలు కూడా మన దేశ ఆర్థిక ప్రగతికి ఎంతగానో దోహదపడుతుందని కళ్యాణ్ పేర్కొన్నారు.

తనను తాను చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకున్న పవన్
అంతటి ప్రాముఖ్యత గల ఈ రంగానికి ఏటా ఆగస్టు 7వ తేదీన చేనేత దినోత్సవం జరుపుకోవడం సంతోషదాయకం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చేనేత కళాకారుల సమస్యల పరిష్కారం, వారి అభ్యున్నతికి తాము ఏర్పాటు చేసిన జనసేన చేనేత వికాస విభాగం కృషి చేస్తుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. చేనేత ఉత్పత్తులపై తనకున్న మక్కువ అందరికీ తెలిసిన విషయమే అని గుర్తు చేసిన ఆయన, ఈ ఉత్పత్తులకు మరింత ప్రచారం కల్పించేందుకు తనను తాను చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించుకున్న సంగతిని మరోమారు పునరుద్ఘాటించారు.
Recommended Video

చేనేతను ఆదరిద్దాం అంటూ పిలుపు
చేనేత కోసం తాను చేస్తున్న కృషి ఇదేవిధంగా కొనసాగుతుందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ చేనేత దినోత్సవం సందర్భంగా యావత్ జాతికి మరోసారి చేనేత కళారంగాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 7వ తేదీన చేనేత దినోత్సవం గా 2015 నుండి ప్రారంభించిన ఉత్సవాలు ఆరేళ్లుగా కొనసాగి ఏడవ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా తన పక్షాన జనసేన పక్షాన చేనేత కళాకారుల అందరికీ హృదయపూర్వక కళాభివందనాలు అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చేనేత పట్ల తనకున్న ప్రేమను స్పష్టం చేస్తూ చేనేత పరిశ్రమను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications