''కారం పొడితో కదిలిన పల్లె''.. జనసేన రణగర్జన
రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ ఏర్పాటై ఇటీవలే 10 సంవత్సరాల కాలాన్ని పూర్తిచేసుకుంది. ఏపీలో నిర్ణయాత్మక శక్తిగా మారాలనే ఉద్దేశంతో ఆయన వారాహి యాత్రను చేపట్టారు. ఇటీవలే మొదటి విడత యాత్ర పూర్తయింది. ప్రజల్లోకి జనసేనను బలంగా తీసుకువెళ్లాలి.. వారి మనసుల్లో దృఢంగా నిలవాలి అంటే అందుకు తగ్గట్లుగా ఒక పాటను రూపొందించాలని పార్టీ నిర్ణయించింది.
జనసేన పార్టీ కోసం రూపొందించిన ఈ ప్రచార గీతం తాజాగా విడుదలైంది. తెలంగాణలో ప్రముఖ గాయకులుగా గుర్తింపు తెచ్చుకున్న మధుప్రియ, నల్లగొండ గద్దర్ ఆలపించారు. బుర్రా సతీష్ రాసిన పాటకు భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. తెలంగాణ అంటే ఎక్కువగా ఆసక్తి చూపే పవన్ కల్యాణ్ పార్టీ ప్రచార గీతాన్ని కూడా తెలంగాణ కళాకారులచేతే పాడించారు. జనాల ఆర్తిని వివరించాలంటే అది పల్లె గొంతులవల్లే సాధ్యపడుతుందనేది పవన్ అభిప్రాయం. సినిమాలకు పాటలు రాసేవారిలో ఆ నైపుణ్యం ఉండదనే ఉద్దేశంతో వీరిని ప్రత్యేకంగా ఎంచుకున్నారు.

''కారం పొడితో కదిలిన చెల్లె.. రోకలి బండలు ఎత్తిన పల్లె. ఉప్పెలా కదిలెను ఊరూరు.. ప్రభుత్వానిపై చేసెను పోరు.. నియంత పాలన నిలువును కూల్చగా.. నిప్పు కణికలై నిగ్గు తేల్చగా, సింగమల్లె మన ఆంధ్ర పల్లెలు జంగు నడిపిరి కూలీ తల్లులు.. జాగోరే జాగో కదిలింది జనసేన.. జన జాతరలో నేడు రణగర్జన చేసేనా.. ఆడపిల్లలంతా అరె అగ్గై మండేనా.. పవనన్న దండులోనా జంగై నినదించేనా?'' అంటూ రాసిన లిరిక్స్ ను మధుప్రియ, గద్దర్ బాగా ఆలపించారు. చిన్నతనం నుంచి పాటే ప్రాణంగా జీవిస్తోంది మధుప్రియ. తెలంగాణలోని ఎన్నో రాజకీయ పార్టీలు నల్లగొండ గద్దర్ చేత పాటలు పాడించుకున్నాయి.












Click it and Unblock the Notifications