పవన్ కళ్యాణ్ భూసేకరణ ప్రకటనపై జేపీ ఏమన్నారు?
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చూడాలని లోక్‌సత్తా వ్వవస్ధాపకుడు జయప్రకాశ్ నారాయణ సూచించారు. గురువారం విశాఖపట్నంలోని జీవీఎంసీ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద సంకల్ప దీక్ష చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్షలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు భూమి సేకరించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనను ఆయన స్వాగతించారు. హైదరాబాద్‌లోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్ధలు ఏర్పాటు చేయడంతో విభజన సందర్భంలో ఏదురైన సమస్యలను ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలోనూ ఇదే విధానాలను అమలు చేయాలనుకోవడం సరికాదన్నారు. గోదావరి నుంచి వృథాగా పోయే 300 టీఎంసీల నీటి సంరక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టంపై ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే నిమిత్తం జయప్రకాశ్ నారాయణ్ సంకల్ప దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్, అనంతరం చేసిన ప్రకటనలపై ప్రజాగ్రహం వ్యక్తమవుతోందని, ఈ నేపథ్యంలో ఏపీకి న్యాయం జరిగేంత వరకు లోక్ సత్తా పార్టీ పోరాటం చేస్తుందని జేపీ ప్రకటించారు.
రాష్ట్రాభివృద్ధిపై కేంద్రపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా మార్చి 3న అనంతపురం, 5న విశాఖపట్నం, 8న విజయవాడలో జేపీ నిరాహారదీక్షలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రేదశ్‌కు జరిగిన తీవ్ర అన్యాయంపై అన్ని రాజకీయ పార్టీలు స్తబ్దుగా ఉన్న సమయంలో కేవలం లోక్‌సత్తా పార్టీ ఒక్కటే ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications