ఇదే మా బతుకు, ఇదీ నీ కథ: జేసీ వర్సెస్ జగన్... అక్కడే స్టార్ట్!
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి, జేసీ సోదరులకు మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనను జగన్ రాజకీయం చేస్తుండటంతో, జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు.
నాతో జగన్‌కు పని ఉంది.. నాకవసరం లేదు, అందుకే అలా: జేసీ
శనివారం నాడు అనంతపురం సాక్షి కార్యాలయం ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు. మగాడివైతే రారా.. తేల్చుకుందాం.. నీ బతుకు నాకు తెలిదా.. నీ దగ్గరకే వస్తా.. ఏం కేసులు పెడతావో పెట్టు అని సవాల్ విసిరారు.
బస్సు ప్రమాదం ఘటన నుంచి సీఎం చంద్రబాబు తమను ఎలా సేవ్ చేశాడో చెప్పాలని సవాల్ విసిరారు. తండ్రి చనిపోయినప్పుడు బాధపడాల్సింది పోయి.. సీఎం పదవి కోసం సంతకాలు చేయించావని జగన్ పైన దుమ్మెత్తి పోశారు.
జేసీ సోదరులు - జగన్ మధ్య చాలా రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే, అది బస్సు ప్రమాదం సంఘటన మలుపు తిప్పింది. అంతకుముందు చంద్రబాబు పాల్గొన్న బహిరంగ సభల్లో, ఇతర సభల్లో జేసీ దివాకర్ రెడ్డి.. జగన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డ సందర్భాలు ఉన్నాయి.
ఏడాది తర్వాత 'కొత్త' సభలో అడుగుపెట్టిన రోజా, పూజలు చేసిన జగన్
ఈ కారణం వల్ల కూడా సాక్షి పత్రిక జేసీ సోదరులను ప్రధానంగా టార్గెట్ చేసిందని అంటున్నారు. ఇదే సమయంలో దివాకర్ ట్రావెల్ బస్సు ప్రమాదం జరగగానే జగన్ వెళ్లి.. బస్సు ఓనర్లను చంద్రబాబు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో జేసీ సోదరులు రియాక్ట్ అయ్యారు. బస్సు ఘటన వీరి మధ్య రాజకీయ వేడి మరింత పెంచింది.

జగన్! సమాధానం చెప్పు
కృష్ణా జిల్లా నందిగామ వద్ద జరిగిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాన్ని జగన్ రాజకీయం చేస్తున్నారని తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డ విషయం తెలిసిందే. జేసీ సోదరులను సీఎం చంద్రబాబు కాపాడుతున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. తమను సీఎం ఎట్లా సేవ్ చేస్తున్నాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి, అనుచర వర్గంతో కలిసి ప్రభాకర్ రెడ్డి శనివారం అనంతపురంలో జగన్ పత్రిక కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. జగన్‌పై ఆయన తీవ్రస్థాయిలో.. పత్రికల్లో రాయలేని భాషలో తిడుతూ ఆవేశంతో ఊగిపోయారు.

మగాడివైతే రా..
'మగాడివైతే రారా.. తేల్చుకుందాం.. నీ బతుకు నాకు తెలీదా.. ఏదో నా బస్సులో ఫాల్టు అన్నావు. నీ దగ్గరకే వస్తా.. ఏమేమి కేసులు పెడతావో పెట్టు..' అని జేసీ ప్రభాకర్.. జగన్‌కు సవాల్ విసిరారు.

ఇదీ మా ఫ్యామిలీ
'బస్సులో రెండో డ్రైవరే లేడని జగన్ అన్నాడు. ఎవడు చెప్పాడు? ప్రమాదంలో తలకు గాయమైన రెండో డ్రైవరే తాను డిక్కీలో పండుకున్నానని చెబుతున్నాడు. అసలు రెండో డ్రైవరే లేడంటే కేసయ్యేది కదా.. డిక్కీలో పండుకునే సౌకర్యం బస్సులో ఉంది. డిక్కీకి రెండు వెంటిలేటర్లున్నాయ్.. ఏసీ ఉంటుంది. విదేశాల్లో కూడా ఇదే పద్ధతిలో బస్సులుంటాయ్.. ఆ బస్సును కూడా విదేశాల నుంచే ఆరు నెలల ముందు తెప్పించాను. ఇవి తెలుసుకోకుండా మాట్లాడతావా.. ముందుగా మమ్మల్ని బస్సు ప్రమాదం నుంచి సీఎం ఎట్లా సేవ్ చేశాడో చెప్పు! మా నాయన కాలం నుంచీ మేం బస్సు ఓనర్లం. మా నాయన 1942లోనే బస్సు ఓనర్. ఆ తరువాత ఫ్రీడం ఫైటర్‌గా జైలుకెళ్లి వచ్చి మళ్లీ బొగ్గు బస్సులు తెచ్చాడు. తరువాత నేను బస్సు ఓనర్నే. నా కొడుకు కూడా బస్సు ఓనరే. వాడు బీటెక్ చేశాడు. ఎంఎస్ లండన్‌లో చేశాడు. లా చేశాడు. అప్పట్నుంచీ ఇప్పటిదాకా మా బతుకుదెరువు అదే. మేం బతికేది దాంతోనే. మాకు బువ్వ పెట్టేది అదే. ఏం... వ్యాపారాలు చేసుకోకూడదా..?' అని ప్రభాకర్ నిప్పులు చెరిగారు.

సూట్ కేసు కంపెనీలు పెట్టి..
'నువ్వు సూట్‌కేస్ కంపెనీలు పెట్టి వచ్చినావు. నీకు సైకిల్ కూడా లేదు.. నా కొడుకు మోటారు సైకిల్‌పై కాలేజీకి వెళ్లాడు. నీ బతుకు నాకు తెలీదా..! పోస్టుమార్టం అంటావు.. పోస్టుమార్టం ఎప్పుడు వచ్చేది? ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చినంకే వస్తుంది. మీ నాయన.. లాస్టుకు బాడీ కూడా దొరకలేదు. కలగూరగంపగా మూటగట్టి ఇచ్చినారు. అదైనా ఆలోచించినావా.. ఏమనుకుంటున్నావు..? తండ్రి చనిపోతే బాధ ఉండాల్సింది పోయి రఘువీరారెడ్డిని అడ్డంపెట్టి సీఎం పదవి కోసం ఎమ్మెల్యేల వద్ద సంతకాలు చేయిస్తావా?

నీలా దొంగ వ్యాపారాలు చేయాలా?
'రాయదుర్గంలో ఐదు మంది కూలీలు చనిపోతే మహిళా కూలీలు దుర్మరణం అని నీ పేపర్లో రాస్తారు. వీళ్లు బీదోళ్లనా.. కూలీలు కాబట్టే అట్లా రాస్తారా..? అదే దివాకర్ రెడ్డి బస్సయితే.. దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అంటావు.. వాస్తవానికి ప్రమాదం జరిగిన బస్సుకు మేం ఓనర్లం కాదు. అయినా మా ఫ్యామిలీది కాబట్టి మేం బాధ్యత తీసుకున్నాం. నాకు కావల్సింది జవాబు.. సీఎం మమ్మల్ని ఎట్లా రక్షిస్తున్నాడో జగన్ చెప్పాలి. అంతదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదు. మమ్మల్ని కూడా దొంగవ్యాపారాలు చేయమనా..!' అని ఊగిపోయారు.

వైయస్ చనిపోయినప్పుడు పైలట్ తాగి ఉన్నాడా?
'ప్రమాదం పైన సీబీ సీఐడీ విచారణ చేయించాలని అడుగు. మా బస్సు డ్రైవర్ తాగినాడని అంటున్నావ్.. మీ నాయన చనిపోయినప్పుడు పైలట్ తాగున్నాడా.. నీవే సీఎం కావాలని పైలట్‌కు తాపినట్టున్నావు. ఇంక నాకు మంచి మాటలు రావు.. నీవేమీ చేయలేవు. తప్పు చేసినావు కాబట్టే కేసులు ఉన్నాయి. జైలుకు పోయినావు. నేను జైలుకు పోయేదానికి సిద్ధం.. చనిపోయిన 11 మందిని తెస్తావా.. తెస్తే ఇలానే జైలుకు పోతా. యాక్సిడెండ్ అంటే అర్థమేమి? ఇంత అన్యాయమా? సీఎంను అంటారా.. బస్సుకు ఇన్సూరెన్సు కట్టా. చంద్రన్న బీమా కింద మా నియోజకవర్గం నుంచి రూ.18 లక్షలు కట్టా. చనిపోయిన మా డ్రైవర్‌కు ఇప్పటికే రూ.10 లక్షలిచ్చా. మొత్తం 35 లక్షలొస్తుంది.' అని జేసీ ప్రభాకర్ ప్రశ్నించారు.

భారతీ సిమెంట్ ఫ్యాక్టరీలో చనిపోతే.. నీలా దొంగతనాలు..
'భారతి సిమెంట్ ఫ్యాక్టరీలో 25 మంది చనిపోతే ఒక్కొక్కరికి రూ.22 వేలిచ్చావ్.. అదీ నీ కథ. నేనుండేది ఎమ్మెల్యేగా ఇంక రెండు సంవత్సరాలు. నా కొడుకు ఇప్పుడు కౌన్సిలర్.. రేపు ఎమ్మెల్యే అయితే వాడినంటారు. మేం వ్యాపారం చేసుకోవద్దా.. మీ నాయనలాగా మా నాయన మాకు దొంగ డబ్బులివ్వ లేదు. దొంగతనాలు చేయాలని చెప్పలేదు.

అల్లుడు ఎమ్మెల్సీ అయిన సంతోషం లేదు
'ఈ రోజు నా అల్లుడు ఎమ్మెల్సీ అయినా మాకు సంతోషం లేదు. ప్రమాదంపైన బాధపడుతున్నాం. అది మా ఖర్మ. చనిపోయిన వాళ్ల ఖర్మ. మహబూబ్‌నగర్ జిల్లా బస్సు ప్రమాదం జరిగినపుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఆరోజు మాకు ఏం సాయం చేశారు? సీబీసీఐడీ కూడా బస్సు ప్రమాదానికి రోడ్డు ఆక్రమణే కారణమని తేల్చింది. ఇక ప్రమాదంలో చనిపోయిన వారి పోస్టుమార్టం రిపోర్టు రావాలంటావు. అది చిన్న గ్రామం. విజయవాడ నుంచి రావాలి. 20 రోజుల టైం పడుతుంది. ఏమైనా తెలివుందా?' అని జేసీ ప్రభాకర్ దుయ్యబట్టారు.

పగలూ తాగుతున్నట్లుంది
'ఇంతకుముందు రాత్రి తాగేవాడు.. ఇప్పుడు పగలు కూడా తాగుతున్నట్టుంది.. ఎవరు కనిపించినా.. ఎక్కడికెళ్లినా నేను సీఎంను అయితా.. నేను సీఎంను అయితా.. అంటున్నాడు.. 2019లో సీఎం కాదు గదా.. పిచ్చిపట్టి నేను సీఎం అంటూ రోడ్డుపై తిరిగే రోజు వస్తుంది' అని అని జగన్‌ను జేసీ ప్రభాకర్ రెడ్డి తూర్పారబట్టారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!