కెసిఆర్-బాబు దొందు దొందే, టిడిపిలోకి వస్తే అది కూడా దొరకదు: జెసి
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఇద్దరేనని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గురువారం నాడు అన్నారు. ఇద్దరు సీఎంలు దొందూ దొందే అన్నారు.
కెసిఆర్ పార్టీలో చేరిన వారికి డబ్బులు ఇస్తారని, పదవులు కాకపోయినా పనులైనా చేస్తారని తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ఏపీలో మాత్రం అది కూడా జరగదని వ్యాఖ్యానించారు. తాను కూడా ఆకర్షణలో భాగంగానే టిడిపిలో చేరానని చెప్పారు.
పార్లమెంటులో తాను ఏఐసీసీ అధ్యక్షురాలు, ఉపాధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసి రాష్ట్ర విభజన సరికాదని చెప్పానని తెలిపారు. సోనియా ఆ మాటను అంగీకరించకుండా.. మరో 20 ఏళ్ల తర్వాత అయినా రాష్ట్ర విభజన సమర్థనీయమని ప్రజలు చెప్తారని తనతో అన్నారని తెలిపారు.

కాగా, బుధవారం జెసి మాట్లాడుతూ... వైసీపీలో ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఒక్కరే మిగులుతారన్నారు. ఏపీలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న టీడీపీ 'ఆపరేషన్ ఆకర్ష్' పై కూడా ఆయన స్పందించారు. వైసీపీ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ అంటున్నారు కానీ, వైసీపీ ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి కొనలేదని ఆయన స్పష్టం చేశారు.
వైయస్ జగన్ వైఖరి నచ్చకనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల పరిణామాల దృష్ట్యా రాయల తెలంగాణ ఇచ్చి ఉంటే బాగుండేదని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డాడు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు పశ్చాతాపడుతున్నారని అన్నారు. రాయల తెలంగాణను ఏర్పాటు చేసినట్లయితే సీమకు కష్టాలు వచ్చేవికావని అన్నారు.












Click it and Unblock the Notifications