చంద్రబాబు సీఎంగా కొనసాగకపోవచ్చు- బాంబు పేల్చిన టీడీపీ సీనియర్ నేత
Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అయిదు సంవత్సరాల పరిపాలన గురించి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో భవిష్యత్ ముఖ్యమంత్రి ఎవరో కూడా అంచనా వేశారు. అటు మిత్రపక్షం జనసేన ప్రస్థానాన్నీ ప్రస్తావించారు.
ఓ న్యూస్ ఛానల్‌కు ఇఛ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు జేసీ దివాకర్ రెడ్డి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎంతో కాలం కొనసాగపోవచ్చని అన్నారు. పూర్తి అయిదు సంవత్సరాల పాటు ఆ కుర్చీలో ఉండకపోవచ్చని చెప్పారు. దీనికి కారణం- ఆయన జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టే అవకాశం ఉండటమేనని జోస్యం చెప్పారు.

చంద్రబాబు స్థానంలో ముఖ్యమంత్రిగా ఆయన కుమారుడు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్.. బాధ్యతలు స్వీకరించే అవకాశాలే అధికంగా ఉన్నాయని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తరువాత ముఖ్యమంత్రి పదవి నారా లోకేష్‌కే దక్కుతుందని వ్యాఖ్యానించారు.
మిత్రపక్షం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటానికి జేసీ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆయన గురించి తనకేమీ తెలియదని ఒక్క ముక్కలో తేల్చి చెప్పారు. ఏమీ తెలియనప్పుడు ఏం మాట్లాడతామంటూ చెప్పుకొచ్చారు.
దివాకర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటోన్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికల తరువాత క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. 2019 నాటి ఎన్నికల్లో పోటీ చేయలేదు. వారసుడిని రంగంలోకి దించారు. 2019 నాటి ఎన్నికల్లో అనంతపురం లోక్‌సభ నుంచి తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డిని పోటీ చేయించారు.
2024 ఎన్నికల్లోనూ దివాకర్ రెడ్డి పోటీ చేయలేదు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి.. ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాలపై గట్టి పట్టు ఉంది జేసీ కుటుంబానికి. అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో జేసీ కుటుంబం చెప్పిందే వేదం.

అలాంటి నేత.. చంద్రబాబు గురించి మాట్లాడటం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి పదవిని కుమారుడికి ఇచ్చిన జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపుతారని చెప్పారు. అంతమాత్రాన చంద్రబాబు అయిష్టంగా సీఎం స్థానాన్ని వదులకున్నట్టు భావించ కూడదని, జాతీయ రాజకీయాల్లో అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్‌పై మాట్లాడటానికి దివాకర్ రెడ్డి నిరాకరించారు. రాజకీయ భవిష్యత్తు తాను అంచనాలు వేయలేనని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్‌పై తనకు పూర్తి అవగాహన లేదని, ఆయన గురించి తెలియదనీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications