జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పిలుపు..!!
విజయవాడ: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతజయంతి వేడుకలు విజయవాడలో ముగిశాయి. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్.. సహా పలువురు ప్రముఖులు దీనికి హాజరయ్యారు. సీనియర్ ఎన్టీఆర్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి గుర్తుచేసుకున్నారు రజినీకాంత్. చంద్రబాబు పరిపాలనపైనా ప్రశంసలు కురిపించారు.
చంద్రబాబు తనకు 30 సంవత్సరాలుగా మిత్రుడని, మోహన్ బాబు ద్వారా తనకు పరిచయం అయ్యాడని రజినీకాంత్ చెప్పుకొచ్చారు. ఆయనకు ఉన్న విజన్ ఏమిటనేది ఇప్పటికే ప్రపంచం మొత్తం చూసిందని కితాబిచ్చారు. హైదరాబాద్‌ను న్యూయార్క్‌లాగా తయారు చేసిన ఘనత చంద్రబాబుదేనని పేర్కొన్నారు. 2024లో చంద్రబాబు గెలిస్తే ఏపీ దేశంలోనే అగ్రగామిగా ఎదుగుతుందంటూ రజినీకాంత్ జోస్యం చెప్పారు.

ఈ వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ జెండాలతో ఆయన అభిమానులు సందడి చేశారు. స్టేజీ ఎదురుగా జూనియర్ ఎన్టీఆర్ జెండా, ఫోటోలను ప్రదర్శించారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాల చేశారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందలేదు. మొదట్లో ఆహ్వానితుల్లో ఆయన పేరు ఉన్నప్పటికీ- ఆ తరువాత మాయమైంది.
ఎన్టీఆర్ జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల సూచనల మేరకే ఆహ్వానితుల జాబితా నుంచి జూనియర్ ఎన్టీఆర్ పేరును తొలగించారనే ప్రచారం ఉంది. జూనియర్‌ను ఆహ్వానించకపోవడం పట్ల ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. మరోసారి ఆయనను అవమానించినట్లు భావిస్తోన్నారు. గతంలో చోటు చేసుకున్న ఇలాంటి సందర్భాలను గుర్తు చేస్తోన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ఆయన మనవడు, తమ అభిమాన నటుడిని పిలవకపోవడం పట్ల అభిమానులందరూ తీవ్ర నిరాశలో ఉన్నారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు నున్న గణేష్, కావూరి కృష్ణ అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కార్యక్రమం ఓ రాజకీయ సదస్సుగా భావిస్తోన్నామని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
తాము ఎంతగానో అభిమానించే నటుడు ఎప్పటికీ తమ గుండెల్లో ఉంటారని, ఆయనకు ఇలాంటి ఆహ్వానాలు అక్కర్లేదని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్‌ను దూరంగా ఉంచినంత మాత్రాన తాము నిరాశకు గురి కావాల్సిన పని లేదని అన్నారు. తాము ఎప్పటికీ నందమూరి కుటుంబ అభిమానులమేనని, ఎవరికి వారు తమ ప్రాంతాల్లో సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు.












Click it and Unblock the Notifications