టీడీపీ To ఎన్టీఆర్ టీడీపీ.. మార్పు మొదలైందా..?
'మా తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు ఆశీస్సులు మనపై ఉన్నంత కాలం.. నా మీద ఉన్నంత కాలం.. నన్ను ఎవ్వరూ ఆపలేరు'.. వార్ 2 ప్రీ-రిలీజ్ వేదికపై ఎన్టీఆర్ నోటి నుంచి వచ్చిన ఈ ఒక్క డైలాగ్ ఇప్పుడు చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇది కేవలం సినిమా డైలాగ్ మాత్రమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ కళ్లలోని కసి, మాటల్లోని ధీమా, ప్రవర్తనలో వచ్చిన మార్పులు చూస్తుంటే, ఆయన అడుగులు నందమూరి తారకరామారావు బాటలో రాజకీయాల వైపు పడుతున్నాయేమో అనే చర్చ మొదలైంది. ఒకవేళ అదే నిజమైతే, చరిత్ర పునరావృతం కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాజకీయ యుద్ధం మొదలైందా?
గతంలో టీడీపీ తరపున ఎన్టీఆర్ ప్రచారం చేసి, ఆ పార్టీకి తన వంతు కృషి చేశారు. కానీ ఆ తర్వాత పార్టీకి దూరం అయ్యారు. ఎన్టీఆర్‌ను పార్టీకి దూరం చేశారా లేక ఆయనే దూరంగా ఉన్నారా అనే విషయంపై స్పష్టత లేదు. అయితే, తాజా పరిణామాలు ఆ నిజాన్ని బయటపెట్టేలా ఉన్నాయి. ఇటీవల వార్ 2 సినిమాకు కాకుండా కూలీ సినిమాకు నారా లోకేష్ ట్వీట్ చేయడం, ఆ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ విజయవాడలో 'సీఎం ఎన్టీఆర్' అంటూ ఫ్లెక్సీలు పెట్టడం చూస్తుంటే, నారా-నందమూరి కుటుంబాల మధ్య అంతర్గత విభేదాలు మరింత పెరిగాయని స్పష్టమవుతోంది.

డైలాగ్‌ల వెనుక రాజకీయ వ్యూహం
వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన కొన్ని డైలాగ్‌లు దీనికి మరింత బలం చేకూర్చుతున్నాయి. "పని చేయించుకుని పక్కన పెట్టడానికి అవసరం లేదన్న మాట" అనే డైలాగ్ 2009లో టీడీపీ తరపున ఎన్టీఆర్ ప్రచారం చేసి, తర్వాత పక్కన పెట్టబడిన సందర్భాన్ని గుర్తు చేస్తోంది. అలాగే, "ఒక మనిషి ఇగోని కెలికితే ఎంత దూరం అయినా వెళ్తాడు" అనే డైలాగ్ కూడా ఎన్టీఆర్ వ్యక్తిగత ఇగోకు దెబ్బ తగిలిందని, అందుకే పార్టీకి దూరంగా ఉన్నారని సూచిస్తుంది.
ఈ పరిణామాలు చూస్తుంటే, ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఆశ్చర్యపోనవసరం లేదని చాలా మంది భావిస్తున్నారు. ఒకవేళ అది జరిగితే, జగన్ YSR కాంగ్రెస్ స్థాపించినట్లు, తాత స్థాపించిన పార్టీ పేరునే "ఎన్టీఆర్ తెలుగుదేశం"గా స్థాపించినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ పరిణామాలు నిజంగానే జరిగి, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే, ఆయన అభిమానులకు మాత్రమే కాకుండా రాజకీయ పరిశీలకులకు కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications