టీడీపీ ఎమ్మెల్యేకి బిగ్ షాక్.. ఆస్తుల స్వాధీనం చేసుకోవాలని కోర్టు తీర్పు !
కడప కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో టీడీపీ ఎమ్మెల్యేకి బిగ్ షాక్ తగిలింది. అప్పు చెల్లించడంలో విఫలమైన కారణంగా.. ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ తీర్పు కేవలం ఎమ్మెల్యేకే కాకుండా, ఆయన కుమారుడు కొండారెడ్డికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే..?
నంద్యాల కొండారెడ్డికి చెందిన రాధా కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ.. హైదరాబాద్‌కు చెందిన పృథ్వీ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటైజేషన్ కంపెనీ లిమిటెడ్ నుంచి అప్పు తీసుకుంది. ఈ అప్పును తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో, పృథ్వీ కంపెనీ కడప కోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన కోర్టు, గోపవరం పంచాయతీలోని సర్వే నంబర్ 670/ఏ1సీ1లో ఉన్న రెండు ఎకరాల స్థలం (కామిశెట్టి కాలేజీ)ని స్వాధీనం చేసుకోవాలని తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ ఆస్తిని పృథ్వీ కంపెనీకి అప్పగించాలి.

అడ్వకేట్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రక్రియ..
ఈ ఆస్తుల స్వాధీన ప్రక్రియను అడ్వకేట్ కమిషనర్ ఇండ్ల రూబెన్ ఆధ్వర్యంలో ఈ నెల 16న, మంగళవారం ఉదయం 10 గంటలలోపు పూర్తి చేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాధా కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డితో పాటు, బద్వేలి శ్రీనివాసులరెడ్డి, మీనా, నంద్యాల కొండారెడ్డి వంటి పలువురు సభ్యులుగా ఉన్నారు. ఈ ఆస్తిని స్వాధీనం చేసుకోవడం ద్వారా అప్పు ఇచ్చిన సంస్థకు న్యాయం జరగనుంది.
అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేపై కోర్టు ఈ తరహా సంచలన తీర్పు ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సహ ఆయన కుటుంబం ఎలా స్పందిస్తారోనని ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications