మీరంతా ఏం చేస్తారో నాకు తెలీదు.. అక్కడ వైసీపీ గెలవాలి!
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో మెజారిటీ స్థానాలను దక్కించుకుకోగలిగితే రెండోసారి కూడా అధికారంలోకి వచ్చినట్లేనని అధికార వైసీపీ భావిస్తోంది. అందుకనుగుణంగా ప్రయత్నాలు ప్రారంభించింది. వైసీపీకి బలమైన నియోజకవర్గాల్లో ఆ పార్టీని నిలవరించగలిగితే అధికారం సులభమని టీడీపీ భావిస్తోంది. త్వరలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో విజయం సాధించేందుకు ఇరు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి.
ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా ఉమ్మడి కడపలో కీలకమైన నియోజకవర్గం జమ్మలమడుగు. ప్రస్తుతం ఇక్కడినుంచి వైసీపీ తరఫున డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి ప్రతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డిపై 51,941 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున రామసుబ్బారెడ్డిపై విజయం సాధించిన ఆదినారాయణరెడ్డి టీడీపీ లో చేరి మంత్రిగా కొనసాగారు. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆది విజయం సాధించారు.

జమ్మలమడుగు నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత 1952లో జరిగిన ఎన్నికల్లో కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ తరఫున కుందా రామయ్య విజయం సాధించారు. 1955లో కుందా రామయ్య కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి గెలుపొందారు. 1967లో జరిగిన ఎన్నికల్లో రామయ్య స్వతంత్ర అభ్యర్థిగా విజయాన్ని దక్కించుకున్నారు.
1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 1983 నుంచి 1999 వరకు వరుసగా జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీచేసిన పొన్నపురెడ్డి శివారెడ్డి ఐదుసార్లు విజయం సాధించారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు పేరుగాంచిన జమ్మలమడుగులో ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఎటువంటి వివాదాలకు, ఘర్షణలకు తావివ్వకుండా మరోసారి విజయం సాధించాలని వైసీపీ ప్రయత్నిస్తుండగా, బీజేపీలో ఉన్న ఆదినారాయణరెడ్డి సహకారంతో విజయం సాధించాలనే పట్టుదలతో టీడీపీ ఉంది.












Click it and Unblock the Notifications