YS Avinash Reddy : సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వండి-హైకోర్టులో అవినాష్ పిటిషన్..
పెదనాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఏపీలో నాలుగేళ్ల క్రితం తీవ్ర సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి (ys vivekananda reddy) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ రేపు విచారణకు రావాలని ఇప్పటికే సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విచారణకు వెళ్లబోయే ముందు అవినాష్.. ఇవాళ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన పాత్రపై సీబీఐ దర్యాప్తుకు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి(YS Avinash Reddy) ఇవాళ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆయన సీబీఐ ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ హైకోర్టును కోరారు. సీబీఐ తనకు సీఆర్పీసీ 160 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చినందున అరెస్టు కాకుండా ఈ ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును కోరారు.
మరోవైపు సీబీఐ తనను ప్రశ్నించే సమయంలో వీడియో రికార్డింగ్ కావాలని కూడా వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. అలాగే విచారణ సమయంలో తనతో పాటు లాయర్ ను కూడా అనుమతించాలని కూడా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కోరారు. ఇప్పటికే గత విచారణ సందర్భంగా కూడా లాయర్ ను అనుమతించాలని అవినాష్ రెడ్డి కోరినా సీబీఐ అధికారులు అనుమతించలేదు. అలాగే వీడియో రికార్డింగ్ కూ అంగీకరించలేదు. దీంతో ఈసారి కచ్చితంగా ఈ రెండు అంశాల్ని సీబీఐ అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును అవినాష్ రెడ్డి కోరారు.
అటు సీబీఐ ఇప్పటికే జారీ చేసిన నోటీసుల మేరకు వైఎస్ అవినాష్ రెడ్డి రేపు హైదరాబాద్ లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. అదే సమయంలో హైకోర్టు కూడా అవినాష్ రెడ్డి పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. విచారణకు స్వీకరిస్తే సీబీఐ విచారణ చేస్తున్న సమయంలోనే ఆదేశాలు ఇస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. దీంతో రేపటి అవినాష్ రెడ్డి విచారణ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే కేసులో ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని ఈ నెల 12న విచారించేందుకు సీబీఐ అధికారులు సిద్ధమయ్యారు.












Click it and Unblock the Notifications