మరో రెండేళ్లే టీడీపీ అధికారం-జమిలిపై వైసీపీ నేత కాకాణి ఆసక్తికర వ్యాఖ్యలు..!
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఏపీలోనూ వీటిపై ఆసక్తి పెరుగుతోంది. అదే సమయంలో రాజకీయ పార్టీలు కేంద్రం జమిలి ప్రతిపాదనకు ఎలా స్పందిస్తాయన్న దానిపైనా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇవాళ జమిలి ఎన్నికలపై స్పందించారు. టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో ఆయన జమిలి ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో టీడీపీ అధికారం మరో రెండేళ్లు మాత్రమేనని కాకాణి గోవర్ధన్ రెడ్డి తేల్చిచెప్పేశారు. 2027లో జమిలి ఎన్నికలు వస్తే టీడీపీ అధికారంలో ఉండేది మరో రెండేళ్లు మాత్రమే అన్నారు. కాబట్టి అధికారులు టీడీపీ మాటలు వింటే ఆ తర్వాత ఇబ్బందులు తప్పవని కాకాణి హెచ్చరించారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియాలకు అధికారులు సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. లాటరీ విధానంలో మద్యం షాపులు 90 శాతం టీడీపీ నేతలకే దక్కడం ఇందుకు నిదర్శనం అన్నారు.

టీడీపీ నేతల కోసమే సీఎం చంద్రబాబు కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. మద్యం షాపుల కేటాయింపులు చూస్తే ఈ విషయం అర్దమవుతోందన్నారు. కొత్త ఎక్సైజ్ విధానంతో చంద్రబాబు, కూటమి నేతలకు కిక్కు ఎక్కుతుందేమో కానీ మందుబాబులకు మాత్రం కక్కు తప్పదన్నారు. వైన్ షాపుల కేటాయింపుల్లో చంద్రబాబు మూడంచెల విధానం అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైన్ షాపులు దక్కించుకున్న వారు 60-40 వాటాలు పంచుకుంటున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications