ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు కాళీపట్నం ఎంపిక
హైదరాబాద్: 2015 సంవత్సరానికి గాను ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ప్రముక కథా రచయిత కాళీపట్నం రామారావు ఎంపికయ్యారు. ఈ అవార్డుని ప్రతి ఏడాది స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదిన్నాన్ని పురస్కరించుకుని మే 28న అందిస్తోన్న విషయం తెలిసిందే.
ఈ అవార్డులో భాగంగా ప్రశంసాపత్రంతో పాటు రూ. లక్ష బహుమతిగా అందిస్తారు. కాళీపట్నం రామారావు 1924, నవంబర్ 9న శ్రీకాకుళంలో జన్మించారు. కారా మాష్టారుగా అందరికీ బాగా సుపరిచితం. శ్రీకాకుళంలోనే తొలి విద్యాభ్యాసం, భీమిలిలో సెకండరీ గ్రేడ్ ట్రయినింగ్ స్కూలులో ఉపాధ్యాయ శిక్షణ పొందారు.

1948 నుంచి 31 సంవత్సరాల పాటు ఒకే ఎయిడెడ్ హైస్కుల్‌లో ఉపాధ్యాయుడిగా సేవలందించారు. అనంతరం కాళీపట్నం రామారావు ఎలిమెంటరీ స్కూలు ప్రధానోపాధ్యాయుడుగా పదవీ విరమణ పొందారు. 1966లో కాళీపట్నం రాసిన 'యజ్ఞం' కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది.
1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. కాళీపట్నం రామారావు శ్రీకాకుళంలో ఫిబ్రవరి 22, 1997 సంవత్సరంలో కథానిలయం ఆవిష్కరించారు. ఈ కథానిలయంలో 2,000 పైగా కథల సంపుటాలు, కథా రచన గురించిన మరో రెండు వేల పుస్తకాలు ఉన్నాయి.