అలా ప్రత్యేక హోదా వస్తుందా: కాల్వ, వెంకయ్య మోసగాడిగా మిగిలిపోతారని రామకృష్ణ
అనంతపురం/ విజయవాడ : ఎన్డీఏ నుంచి తమ పార్టీ బయటికి వస్తే ప్రత్యేకహోదా వస్తుందా అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, తెలుగుదేశం పార్టీ నాయకుడు కాల్వశ్రీనివాసులు ప్రశ్నించారు. బుధవారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు.
ప్రత్యేకహోదాతోనే సమస్యలు పరిష్కారమవుతాయిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారని కాల్వ శ్రీనివాసులు చెప్పారు. కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత బీజేపీదేనని, పరిస్థితి తీవ్రతను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకే చంద్రబాబు కొంత గట్టిగా మాట్లాడారని ఆయన చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తిస్తారని ఆశిస్తున్నామని చెప్పారు.

ఇదిలావుంటే, ప్రత్యేక హోదా సాధించేవరకు తమ పోరాటం ఆగదని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్సి రామకృష్ణ స్పష్టం చేశారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని మోడీ నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రత్యేహోదా విషయంలో సీఎం ప్రజలను మోసం చేస్తున్నారని, సీఎంకు చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. ప్రత్యేకహోదాపై సిపిఐ పోరాటాన్ని సాగిస్తున్న విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, ప్రత్యేక ప్యాకేజీ అవసరం లేదని రామకృష్ణ అన్నారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మోసగాడిగా మిగిలిపోతారని ఆయన అన్నారు.
ఈ నెల 22, 23 తేదీల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మేధావులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications