స్కామ్స్‌తో జగన్ ఎపికి ఖ్యాతి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: చిత్రవిచిత్రమైన కుంభకోణాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ ఖ్యాతి తెచ్చిన పెట్టిన ఘనత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిదేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. సీమాంధ్ర నేతలపై ఆమె బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను కుంభకోణాల రాజధానిగా మార్చిన చరిత్ర సీమాంధ్రులదేనని ఆమె ఆరోపించారు. కేంద్ర మంత్రుల బృందం (జివోఎం) మునందు హైదరాబాద్ గురించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన విషయాలన్నీ అబద్ధాలేనని ఆమె అన్నారు.

అంతర్జాతీయ పత్రికలు ప్రచురించిన కుంభకోణాల్లో తెలంగాణ వ్యక్తి ఒక్కరు కూడా లేరని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిన రెండేళ్లలో తెలంగాణను మిగులు విద్యుత్తు రాష్ట్రంగా మారుస్తామని ఆమె చెప్పారు. నక్సలిజం, ఉగ్రవాదం లేని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే దక్షత తెలంగాణ సమాజానికి ఉందని ఆమె దీమా వ్యక్తం చేశారు.

భద్రాచలం దేవాలయం తెలంగాణ ప్రజల శ్రమతో రూపొందిందేనని ఆమె అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో కొత్త వివాదం సృష్టిస్తున్నారని, శ్రీశైలం ఎడమగట్టు వాటా కచ్చితంగా తెలంగాణకు వచ్చి తీరుతుందని ఆమె అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా భావించడం లేదని ఆమె అన్నారు. విద్యుత్తుపై, జలాలపై కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన విషయాల్లో వాస్తవం లేదని కవిత అన్నారు.












Click it and Unblock the Notifications