వేరేవాళ్లతో మీకు అనవసరమండీ.. ఆయన్ను చూడండి
వేరేవాళ్లతోనో, వ్యక్తులతోనే మీకు అనవసరమని, కేవలం ముఖ్యమంత్రి జగన్ ను చూసి మాత్రమే ఓటువేయాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. మనసులో ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దని, ఇతరులకు సంబంధం లేకుండా వైసీపీకి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలం గంగాయపల్లెలో రవీంద్రనాథ్ రెడ్డి పర్యటించారు. వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ పుల్లయ్య పార్టీలో ఉన్నాడని.. నాకు పుల్లయ్యతో సరిపడదు కాబట్టి వైసీపీకి కాకుండా మరో పార్టీకి ఓటు వేస్తాననే ఆలోచన తీసుకురావద్దన్నారు.
జగన్ గొప్ప పరిపాలన అందిస్తున్నాడన్నారు. మరో 25 సంవత్సరాలు జగన్ ముఖ్యమంత్రిగా ఉండేలా అందరూ ఆశీర్వదించాలని కోరారు. వల్లూరు మండలంలో 1300 మంది లబ్ధిదారులకు చేయూత కింద నిధుల చెక్కులను పంపిణీ చేశారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండోసారి అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు విజయం సాధించడమే ముఖ్యం కాబట్టి వారి పనితీరుపై సర్వే చేయిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన చేయించిన సర్వేల్లో కొందరు ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని తేలింది. ఇటీవలే రెండుసార్లు పార్టీ ఎమ్మెల్యేలతోపాటు మంత్రులతో కూడా జగన్ సమావేశమయ్యారు.
ప్రజల్లో మంచిపేరు లేనివారు, పేరున్నా మంచి పనితీరు కనపరచనివారి పేర్లను నేరుగా చదివి వినిపించారు. తన సర్వేలో పనితీరు బాగోలేదని తేలితే సీటివ్వనని తేల్చిచెప్పారు. మీ మీద నాకు ప్రేమ ఉన్నప్పటికీ సీటు విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తానని, గెలుపు గుర్రాలకే టికెట్లు దక్కుతాయని జగన్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications