అలాగైతే విభజన తప్పే: జైపాల్‌రెడ్డికి హరిబాబు కౌంటర్
విశాఖపట్నం: పోలవరం ప్రాజెక్టు నిర్మించేందుకు వీలుగా ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం తప్పయితే రాష్ట్రాన్ని విభజించడం కూడా తప్పేనని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, విశాఖ పార్లమెంటు సభ్యుడు కంభంపాటి హరిబాబు ఆదివారం అన్నారు.
ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడారు. ముంపు గ్రామాలను ఏపీలో కలపడం రాజ్యాంగ విరుద్ధమని మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం ప్రజలను మోసం చేయడమే అన్నారు. అధికరణ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ఇచ్చారని, అదే ఆర్టికల్ ప్రకారం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో ముంపు గ్రామాలను కలిపారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.

నాటి యూపీఏ మంత్రివర్గంలో జైపాల్ రెడ్డి ఉన్నప్పుడే ముంపు మండలాలకు సంబంధించిన ఆర్డినెన్స్ రూపకల్పన జరిగిందన్న విషయాన్ని ఆయన మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు డిజైన్ మీద తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు పలు వ్యాఖ్యలు చేస్తున్నారని, నిపుణులైన ఇంజనీర్లు వాటిని తయారు చేస్తారన్నారు.
రాజకీయ నాయకులు డిజైన్ల పైన సూచించడం మంచి సంప్రదాయం కాదని హితవు పలికారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సుమారు 12 సంస్థలను కేటాయించారని, వాటిని వికేంద్రీకరణ విధానంలో భాగంగా అన్ని ప్రాంతాలలో నెలకొల్పుతామన్నారు. ఏ సంస్థను ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయం రాష్ట్రమే నిర్ణయించి కేంద్రానికి నివేదిక పంపవలసి ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications