"15రోజులకొకసారి జగన్ అలా.. అప్పుడు తండ్రిని అడ్డుపెట్టుకుని, ఇప్పుడేమో!"
కడప: వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. ప్రధాని మోడీని బట్టలిప్పి కొట్టాలని కామెంట్స్ చేసిన కరుణాకర్ రెడ్డికి అసలు సంస్కారమనేది ఉందో లేదో తెలియడం లేదన్నారు.
హిందూ మతంపై ఏమాత్రం విశ్వాసం లేని భూమన లాంటి వ్యక్తులకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టారని కామినేని ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్ పదవిలో కరుణాకర్ రెడ్డి చేసిన అక్రమాలన్ని ప్రజలందరికీ తెలుసునని పేర్కొన్నారు. మంగళవారం నాడు కడపలో ఓ ప్రైవేటు డయోగ్నోస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు కామినేని.

భూమనతో పాటు జగన్ పై కూడా పలు విమర్శలు గుప్పించారు కామినేని. పక్క రాష్ట్రంలో నివాసముండే జగన్ కు రాష్ట్రంలో పరిస్థితులపై అసలు అవగాహన లేదని అన్నారు. 15రోజులకు ఒకసారి ఏదో మాట్లాడాలనే ఉద్దేశ్యంతో ఏదో ఒకటి మాట్లాడడమే జగన్ పని అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో కనీస మౌలిక సదరుపాయాలు లేవని జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
తండ్రి అధికారంలో ఉండగా.. అధికార దుర్వినియోగానికి పాల్పడి కోట్లు దోచుకున్న జగన్, ఇప్పుడు సొంతంగా దోచుకోవడానికి మార్గాలు అన్వేషిస్తున్నారని ఆరోపించారు. జగన్ కు మంచి వినబడదు, మంచి కనబడదు అంటూ విమర్శించారు. ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకోకుంటే జనమే గట్టిగా బుద్ది చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications