జగన్‌కు షాకిస్తూ బీజేపీలోకి కందుల బ్రదర్స్, విభజనపై వెంకయ్య..
కడప: ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిక్షణం అభివృద్ధి అజెండాతో ముందుకు వెళ్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం అన్నారు. కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కందుల సోదరులు వెంకయ్య సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు.
అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు ప్రజలకు అందాలన్నారు. గత పదేళ్లలో కాంగ్రెస్ దేశాన్ని సర్వనాశనం చేసిందన్నారు. మోడీ రాకతో దేశానికి మంచి రోజులు వచ్చాయన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమకు నీటి కొరత తగ్గుతుందన్నారు. ఒకదాని తర్వాత ఒకటి... ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను బీజేపీ పరిష్కరిస్తుందన్నారు.
పదేళ్లలో కాంగ్రెస్ దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు. మ్యాప్ మధ్యలో గీత గీసినట్లుగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని ఆరోపించారు. ప్రజల కష్టనష్టాలను పట్టించుకోకుండా ఎన్నికలకు కొద్ది ముందు రోజులు విభజన చేశారన్నారు.

కడప జిల్లాలో డీఆఱ్డీవో అనుబంధ సంస్థ, స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అభివృద్ధిలో రాజకీయాలకు తావులేదన్నారు. టీడీపీ, బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్న తేడా చూపబోమన్నారు. తమకు అభివృద్ధి ముఖ్యమని చెప్పారు.
కరువు ప్రాంతమైన రాయలసీమను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు. పోలవరం, హంద్రీనీవా ప్రాజెక్టులకు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కమిటీని నియమించామని ఆయన చెప్పారు.
అదే విధంగా రక్షణ పరిశోధన కేంద్రాన్ని కూడా రాయలసీమలోని అనువైన ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని వెంకయ్య తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రధాని మోడీ అన్ని విధాలు కృషి చేస్తున్నారని, ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకూడదని ఆయన యువతకు సూచించారు.
కేంద్రమంత్రి వెంకయ్య సమక్షంలో పలువురు కడప జిల్లా నేతలు కాషాయ కండువాలు కప్పుకున్నారు. మాజీమంత్రి సరస్వతి, కందుల రాజేందర్ రెడ్డి, మరో మహిళా నేత సరస్వతి బీజేపీలో చేరారు.












Click it and Unblock the Notifications