త్వరలో రాజకీయ భవిష్యత్ ప్రకటిస్తా- ముద్రగడ పద్మనాభం వెల్లడి...
ఏపీలో కాపు రాజకీయాలకు ఒకప్పుడు కేంద్ర బిందువుగా ఉన్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తిరిగి యాక్టివ్ కాబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా తుని రైలు దగ్ధం కేసులో విజయవాడ రైల్వేకోర్టు నిర్దోషిగా ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ ముద్రగడ కీలక వ్యాఖ్యలు చేస్తూ ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాశారు. అలాగే దీన్ని తన ఇంట్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ముద్రగడ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
ఏపీ ప్రజలను ఉద్దేశించి రాసిన బహిరంగ లేఖలో ముద్రగడ పద్మనాభం తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు కనిపించింది. తన తాత, తండ్రుల బాటలో నడుస్తున్నానని ప్రజలకు ముద్రగడ గుర్తుచేశారు. నా జాతిని అమ్మకం పెట్టడం గానీ, తాకట్టు పెట్టడం గానీ చేయలేదన్నారు. ఉద్యమాలే ఊపిరిగా నడిచానని, జీవితమే పోరాటం, పోరాటమే జీవితంగా ఉద్యమాలు చేశానని ముద్రగడ తెలిపారు. ఎప్పుడూ ఏ ప్రలోభాలకు లొంగలేదన్నారు.

జీవితంలో ఎప్పూడూ కోర్టుకు వెళ్లలేదని, తుని రైలు ఘటనలో మాత్రం కోర్టు వాయిదాలకూ క్రమం తప్పకుండా హాజరయ్యానని ముద్రగడ తెలిపారు. గతం గతః, ఎవరినీ నిందించనన్నారు. తుని రైలు ఘటన కేసులో పూర్తిగా తనదే బాధ్యత అని, మిగతా కాపు నేతలు కోర్టు మెట్లెక్కడం తనను బాధించిందన్నరాు. ఈ కేసులో కోర్టు తనకు ఉరిశిక్ష వేసినా అప్పీలు చేయననన్నారు.
ఈరోజుకూ తనలో ఉద్యమ స్ఫూర్తి తగ్గలేదన్నారు.
తనకు పదవీ కాంక్షలేదని, గతంలో ఎన్నో పదవులు వదులుకున్నానని ముద్రగడ తెలిపారు. ఓసారి డ్రైనేజీ బోర్డు పదవి, మరోసారి మంత్రి పదవి, ఇంకోసారి జాతి కోసం ఎమ్మెల్యే పదవులు వదులుకున్నట్లు ముద్రగడ తెలిపారు. గతంలో ఎన్టీఆర్ మంత్రి పదవి ఇస్తానన్నా తీసుకోలేదన్నారు. రైల్వే కోర్టులో న్యాయం గెలిచిందని, త్వరలో రాజకీయ భవిష్యత్ ప్రకటిస్తానని ముద్రగడ వెల్లడించారు. దీంతో ముద్రగడ ఎన్నికలకు ముందు ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications