అమరావతి రైతుల మహా పాదయాత్రకు కర్ణాటక రైతుల సంఘీభావం; భారీ విరాళం ఎంతిచ్చారంటే!!
ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతి మాత్రమే కొనసాగాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న మహా పాదయాత్ర కొనసాగుతూనే ఉంది. చిత్తూరు జిల్లాలో హుషారుగా అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతుంది. గురువారం నాడు 39 వ రోజు పాదయాత్రలో భాగంగా అమరావతి ప్రాంత రైతులు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జోరు వానను సైతం లెక్కచేయకుండా పాదయాత్రను కొనసాగించారు.

చిత్తూరు జిల్లాలో సాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర
రాజధానిగా అమరావతి కొనసాగించాలన్న ఆకాంక్షను చిత్తూరు జిల్లాలోని వాయు లింగేశ్వర స్వామికి తెలియజేస్తూ అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర చేస్తున్న రైతులకు పోలీసులు ఆంక్షలు పెడుతూ, అడ్డంకులు సృష్టిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ మొక్కవోని దీక్షతో అమరావతి ప్రాంత రైతులు పాదయాత్రను సాగిస్తున్నారు. పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా పాదయాత్ర చేస్తున్న రైతులకు మద్దతుగా వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వృత్తి సంఘాలు నిలుస్తున్నాయి. సిపిఐ, సిపిఎం, టీడీపీ, జనసేన, బిజెపి నాయకులు సైతం రక్షణ కవచంగా ముందుండి అమరావతి రైతుల పాదయాత్ర ను ముందుకు నడిపిస్తున్నారు.

రైతుల పాదయాత్రకు కర్ణాటక నుండి వచ్చిన ప్రవాసాంధ్ర రైతుల మద్దతు
బుధవారం చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న మహాపాదయాత్రలో సిపిఐ నేత నారాయణ పాల్గొని రైతులకు తన సంఘీభావాన్ని తెలిపారు. ఇటీవల కాలికి గాయమై నడవలేని పరిస్థితుల్లో కూడా సిపిఐ నేత నారాయణ న్యాయస్థానం టు దేవస్థానం అంటూ అమరావతి రైతులు సాగిస్తున్న పాదయాత్రకు మద్దతుగా ముందుకు సాగారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని నారాయణ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే గురువారం రోజు రైతులు నిర్వహిస్తున్న పాదయాత్రకు కర్ణాటక నుండి ఎలమంచిలి వెంకట వాసుదేవరావు దంపతుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రవాసాంధ్రులు తమ మద్దతు ప్రకటించారు.

రైతుల మహాపాదయత్రకు సంఘీభావం .. 60 లక్షల రూపాయల విరాళం
రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం ప్రకటించిన వారు 60 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసింది. రాజధాని అమరావతి ప్రాంత రైతులు పడుతున్న కష్టాలు చూసి గుండె తరుక్కు పోతుంది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టిన గడ్డకు తోచిన సహాయం చేయడానికి తాము ముందుకు వచ్చామని పేర్కొన్నారు. సాటి రైతులుగా రైతుల కష్టాన్ని గుర్తించామని రైతుల పోరాటం గెలవాలన్నదే తమ ఆకాంక్ష అని వారు పేర్కొన్నారు. అమరావతి ప్రాంత రైతులకు కర్ణాటక నుండి వచ్చిన ప్రవాసాంధ్ర రైతులు సంఘీభావాన్ని ప్రకటించి చివరకు విజయం సాధించేది రైతులే నంటూ తేల్చి చెప్పారు.
Recommended Video

శ్రీకాళహస్తిలో పోలీసుల తీరుపై అమరావతి రైతుల అసహనం
ఇదిలా ఉంటే శ్రీకాళహస్తిలో పాదయాత్ర చేస్తున్న రైతులకు పోలీసులు అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తున్నారు. పోలీసుల భయానికి ఎవరూ తాము బస చేయడానికి కళ్యాణ మండపాలు కూడా ఇవ్వడం లేదంటూ అమరావతి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత 38 రోజుల నుండి తాము శాంతియుతంగానే మహాపాదయాత్ర నిర్వహిస్తున్నామని, చిత్తూరు జిల్లాలో పెడుతున్న ఆంక్షలు మరే ఇతర జిల్లాల్లోనూ లేవని అమరావతి రైతులు చెప్తున్నారు. అనేక ఇబ్బందులు ఎదురవుతున్నా శాంతియుతంగా అమరావతి ప్రాంత రైతులు సాగిస్తున్న మహా పాదయాత్రకు పోలీసులు సహకరించాలని అమరావతి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications