గాలి కుమార్తె పెళ్లి వేడుకలు: అధికారుల నిఘా ?
హైదరాబాద్: మైనింగ్ సామ్రాజ్యంలో ఓ వెలుగు వెలిగిన గాలి జనార్దన్ రెడ్డి తన ఏకైక కుమార్తె బ్రహ్మిణి వివాహం చెయ్యడానికి సిద్దం అయ్యారు. గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె బ్రహ్మిణిని హైదరాబాద్ కు చెందిన రాజీవ్ రెడ్డికి ఇచ్చి వివాహం చేస్తున్నారు.
బ్రహ్మిణి, రాజీవ్ రెడ్డి పెళ్లి శుభలేఖలు చూసి అందరూ ఆశ్చర్యానికి గురైనారు. శుభలేఖలే ఇలా ఉంటే పెళ్లి ఎలా చేస్తారా ? అని అందరూ వారికి తోచినట్లు వారు ఊహించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో గాలి జనార్దన్ రెడ్డి మీద ఆదాయ పన్ను శాఖ, సీబీఐ అధికారులు దృష్టిసారించారు.
ఇప్పటికే అనంతపురం జిల్లాలోని ఓబళాపురం మైనింగ్ అక్రమాల కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న గాలి జనార్దన్ రెడ్డి మీద అధికారులు నిఘా పెట్టారు. కర్ణాటక లోకాయుక్తలో ఆయన మీద కేసు నమోదు అయ్యింది. సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇప్పుడు రంగరంగ వైభవంగా తన కుమార్తె వివాహం చెయ్యడానికి సిద్దం అయిన గాలి మీద మళ్లీ అధికారుల కన్నుపడిందని సమాచారం. బెంగళూరు నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో గాలి కుమార్తె బ్రహ్మిణి వివాహం జరగనుంది.
2012లోనే సీబీఐ అధికారులు గాలి జనార్దన్ రెడ్డి ఆస్తులు గుర్తించారు. పలు ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అయితే గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె వివాహాన్ని ఇంత గ్రాండ్ గా చెయ్యడానికి సిద్దం కావడంతో ఆయన ఇంకా ఎవైనా అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారా ? అని ఆరా తీస్తున్నారు.
రాజకీయాలకు దూరంగా ఉంటున్న గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులోనే నివాసం ఉంటున్నారు. బెయిల్ మీద బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి బళ్లారికి వెళ్లలేదు. ఆయన ఉపయోగిస్తున్న హెలికాప్టర్, విలాసవంతమైన కార్లను గతంలో సీబీఐ సీజ్ చేసింది.
తరువాత వాటి విలువ లెక్కకట్టి తిరిగి గాలికి ఇచ్చేశారు. గాలి జనార్దన్ రెడ్డి ఎన్ని శుభలేఖలు తయారు చేయించారు ? వాటి ఖర్చు ఎంత ? పెళ్లికి ఎంత ఖర్చు చేస్తున్నారు అని ఆదాయ పన్నుశాఖ అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం.
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు సైతం మాజీ మంత్రి గాలి కుమార్తె పెళ్లి ఖర్చుల వివరాలను గుట్టుచప్పుడు కాకుండా సేకరిస్తున్నారని తెలిసింది. అయితే పక్కా ప్లాన్ తో గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె వివాహం చెయ్యడానికి అన్నీ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారని ఆయన వర్గీయులు అంటున్నారు.












Click it and Unblock the Notifications