అవినీతి కొత్త కాదు - మేం సత్యవంతులం కాదు: వైసీపీ ఎమ్మెల్యే..!!
కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వైసీపీలో కలకలానికి కారణమయ్యాయి.
వైసీపీ నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు వరుస వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఇప్పుడు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఆనం ప్రభుత్వం పైన చేసిన వ్యాఖ్యలతో ఆయన్ను పార్టీ పూర్తిగా పక్కన పెట్టేసింది. మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని పిలిచి స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడినా...ఆయన తాజాగా తన పైన నిఘా కొనసాగుతోందంటూ వ్యాఖ్యలతో కలకలానికి కారణమయ్యారు. ఇప్పుడు అదే జిల్లాకు చెందిన ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అవినీతి కొత్త కాదని చెబుతూ..తాము సత్యవంతులం కాదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంలోనే అవినీతి ఎక్కువ జరిగిందని చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అవీనితి అనేది కొత్తది కాదన్నారు. అదే సమయంలో తాము సత్యవంతులం కామని చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో బీద రవిచంద్ర రూ 400 కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారని ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. రవిచంద్రతో పాటుగా టీడీపీ నేత మాలేపాటి సుబ్బారాయుడు గ్రావెల్ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పుడు తమ పాలనలో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలు పేదల ఇళ్ల అవసరాలకేనని చెప్పుకొచ్చారు. అక్కడక్కడా మున్సిపల్ అధికారుల పైన ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఎక్కడైనా ఇళ్ల నిర్మాణాలకు మామూళ్లు అడిగితే తనకు ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అలాంటి ఆరోపణలకు అవకాశం లేకుండా చూస్తానని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే, ఇప్పుడు ఎమ్మెల్యే అవినీతి కొత్త కాదంటూ చేసిన వ్యాఖ్యల పైన చర్చ మొదలైంది.

ఇక..తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ కొత్త వివాదానికి కారణమయ్యారు. ట్యాపింగ్ విషయం తెలిసే తాను 11 ఫోన్లు వాడుతున్నానని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కోటంరెడ్డి వ్యాఖ్యల పైన పార్టీ అధినాయకత్వం ఆరా తీసింది. ఏం జరుగుతోందని జిల్లా మంత్రి నుంచి సమాచారం సేకరించింది. కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యల పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. కోటంరెడ్డి వరుసగా ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో కోణం లో చర్చ కొనసాగుతోంది. దీంతో..ఇప్పుడు కోటంరెడ్డి వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్ ఏం చేయబోతున్నారనేది నెల్లూరు జిల్లా పార్టీలో ఉత్కంఠకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications