డిగ్గీ వ్యాఖ్య: కెసిఆర్ ఢిల్లీ యాత్ర విలీనం చర్చలకే?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఢిల్లీ యాత్రపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో కెసిఆర్ ఢిల్లీ పర్యటనపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్తున్నా, తెలంగాణ రాష్ట్రంలోకి వస్తా అని కెసిఆర్ గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తాను తిరిగి వస్తానని చెప్పారు.
పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రతిపాదించే తేదీలు కూడా తనకు తెలుసునని, ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడానని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి ఆయన కాంగ్రెసు అధిష్టానం పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అర్థమవుతోంది. తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టి తెలంగాణ ఏర్పాటు చేసేవాళ్లు తనతో అన్ని విషయాలూ చెప్పారని ఆయన అన్నారు. సోనియా గాంధీ పుణ్యంతోనే తెలంగాణ ఏర్పడుతోందని, అవసరమైతే సోనియానూ కలుస్తానని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు.

కాగా, తెలంగాణ రాష్ట్రం ఇస్తే పార్టీని తమ పార్టీలో విలీనం చేస్తానని కెసిఆర్ చెప్పారని, ఆ మాటకు కెసిఆర్ కట్టుబడి ఉండాలని దిగ్విజయ్ సింగ్ గురువారంనాడు అన్నారు. తెరాసను కాంగ్రెసులో విలీనం చేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కెసిఆర్ పార్టీ విలీనంపై చర్చలకే రేపు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నట్లు భావిస్తున్నారు. విలీనం కోసమే కెసిఆర్ ఢిల్లీ వెళ్తున్నారని తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు అన్నారు.
తెలంగాణ ఇస్తే బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటానని కెసిఆర్ అన్నారు. అంతేకాదు, తెలంగాణ ఇస్తే కాంగ్రెసులో తన పార్టీని విలీన చేస్తానని ఆ పార్టీ పెద్దలకు హామీ కూడా ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెసు అధిష్టానం పెద్దలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, విలీనానికి తెరాసలోని ఓ వర్గం వ్యతిరేకంగా ఉంది. విలీనం చేస్తే తెలంగాణ భవిష్యత్తును కాంగ్రెసు చేతుల్లో పెట్టినట్లవుతుందని ఆ వర్గం అంటోంది. బంగారు తెలంగాణ ఏర్పాటు తెరాస వల్లనే సాధ్యమవుతుందని వాదిస్తోంది.












Click it and Unblock the Notifications