ఏపీలో కేసీఆర్ బీఆర్ఎస్ మౌనరాగాలు!!
తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పార్టీని విస్తరించాలని ప్లాన్ చేశారు. ఇక పార్టీ విస్తరణ పైన వరుస ప్రకటనలు కూడా చేశారు. మొదటి సరిహద్దు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో అన్నిచోట్ల పోటీ చేస్తామని చెప్పినప్పటికీ, ఏపీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసినప్పటికీ, అందుకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో కెసిఆర్ బీఆర్ఎస్ ఏపీలో డోలాయమాన స్థితిలో ఉందన్న అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ, ఒడిస్సా, మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి కొంతమంది నేతలు వచ్చి చేరిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏపీ పై ఫోకస్ పెట్టిన కేసీఆర్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్ ను నియమించారు. రావెల కిషోర్ బాబు, పార్థసారథి వంటి నేతలు సైతం బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకేం దూకుడుగా ఏపీలో పార్టీ ముందుకు వెళుతుందని భావించినా ఇప్పటివరకు ఆ దూకుడు కనిపించలేదు. ఇటీవల అమరావతి రాజధాని అని రాజధాని విషయంలో బీఆర్ఎస్ విధానాన్ని ప్రకటించినా ప్రజల నుంచి బీఆర్ఎస్ కు పెద్దగా మద్దతు లేదు.

ఇక ఏపీలో దూకుడుగా పార్టీని ముందుకు తీసుకువెళ్తారని భావించినా పరిస్థితి అలా లేదు. బీఆర్ఎస్ ఏర్పాటు సందర్భంగా విశాఖలో కానీ విజయవాడలో కానీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ఇప్పటివరకు బహిరంగ సభ ఊసే లేదు. ఇక మహారాష్ట్రలో మాత్రం కేసీఆర్ రెండు సార్లు బహిరంగ సభ పెట్టి పార్టీ విస్తరణకు ముందుకు వెళ్ళటం ప్రధానంగా కనిపిస్తుంది. మహారాష్ట్రలో రెండు సార్లు బహిరంగ సభలు పెట్టిన కేసీఆర్ ఏపీపై ఎందుకు ఫోకస్ చెయ్యటం లేదన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా, ఏపీ నుండి అంత బాగా రెస్పాన్స్ రావటం లేదని చర్చ జరుగుతుంది. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలుగా పని చెయ్యటానికి, పార్టీ జెండా మొయ్యటానికి జనాలు అంతగా ఆసక్తి చూపించటం లేదన్న చర్చ జరుగుతుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయిందని, అన్నిటి కంటే తోట చంద్రశేఖర్ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని ముందుకు నడిపించలేక పోతున్నాడు అన్న భావన కూడా వ్యక్తం అవుతుంది. అందుకే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో మౌన రాగాలు ఆలపిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications