సెటిలర్ల ఓట్లతో గెలుస్తామంటారా?: కెసిఆర్ ఫైర్
మహబూబ్‌నగర్: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించి, ఆయనను జైల్లో తోస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు హెచ్చరించారు. ఈ భయంతోనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన బిజెపి నేత వెంకయ్యనాయుడుతో కలిసి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మహబూబ్‌నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బుధవారం కెసిఆర్ పర్యటించారు. మహబూబ్‌నగర్, వనపర్తిలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు.
ఉద్యోగుల విభజనలో ఆప్షన్లు లేవని, ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణ భరించబోదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మొత్తం ఆంధ్ర ప్రాంత పోలీసు అధికారులే పనిచేస్తున్నారని, ఆప్షన్లు ఇస్తే సచివాలయంలో 90 శాతం ఆంధ్ర ప్రాంత ఉద్యోగులే ఉంటారని, 10 శాతం మాత్రమే తెలంగాణవారుంటారని అన్నారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని చెప్పారు.

కాంగ్రెసు నాయకులు దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య ఆంధ్ర వారికి కొమ్ము కాస్తున్నారా? తెలంగాణ వారికి కొమ్ము కాస్తున్నారా? అని అడిగారు. తెలంగాణ ప్రజల కోరిక, ఆకాంక్షలు వారికి తెలియవని ఆయన అన్నారు. ఏనాడైనా వారు ఉద్యమం చేశారా? లాఠీ దెబ్బలు తిన్నారా? ఇలాంటి వారికి కడుపునొప్పి ఉండదు'' అని కెసిఆర్ అన్నారు.
కొంతమంది నాయకులు సిగ్గు లేకుండా తెలంగాణ ప్రాంతంలోని సెటిలర్ల ఓట్లతోనే గెలుస్తామని నమ్ముతున్నారని దుయ్యబట్టారు. ఇలాంటివారికి తెలంగాణ ప్రాంతంలో ఓటడిగే హక్కు లేదన్నారు. సెటిలర్ల ఓట్ల కోసం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తారా? అని కెసిఆర్ అడిగారు. తెలంగాణ ఏర్పాటులో పాక్షిక విజయమే సాధించామని, మళ్లీ దగా చేసేందుకు, ప్రాజెక్టులు అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని హెచ్చరించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అవినీతికి పాల్పడితే బిడ్డా, కొడుకా, బంధువా అనేది చూడనని, ఎవరినైనా జైలుకు పంపిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications