రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు బాబుకు చిక్కు! అందువల్లే వెళ్లలేదు
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం నాడు హైదరాబాద్ వచ్చిన సమయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నారు. అయితే, రాష్ట్రపతిని స్వాగతించేందుకు చంద్రబాబు నిబంధనలు అడ్డుగా నిలిచాయి.
ఏపీ పాలకులు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుండి పాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం రాష్ట్రపతి ప్రణబ్.. చంద్రబాబు ఉన్న ప్రదేశానికి కొద్ది దూరంలో హకీంపేటలోనే విమానం దిగారు.
అయితే, వెళ్లి స్వాగతం పలికేందుకు బాబుకు నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. దక్షిణాది విడిదిలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేటలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో విమానం దిగి, అక్కడి నుంచి సమీపంలోనే ఉన్న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు.
రాష్ట్రపతి వస్తున్నప్పుడు ఆయనకు స్వాగతం పలకడానికి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఆయన త్రివిధ దళాధిపతి కావడంతో సైనిక స్వాగతం ఉంటుంది. ఈసారి కూడా రాష్ట్రపతి విమానం నుంచి దిగగానే సైనికాధికారి సెల్యూట్ చేసి స్వాగతం పలికారు.

ఆయన పక్కనే ప్రొటోకాల్ ప్రకారం గవర్నర్ నరసింహన్, ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంతి చంద్రశేఖర రావు, ఆయన పక్కనే చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, ఉప ముఖ్యమంత్రులు మెహమూద్ అలీ, కడియం శ్రీహరి వరుసగా నిల్చొని రాష్ట్రపతికి అభివాదం చేసి కరచాలనం చేశారు.
అయితే ఏపీకి చెందిన ఒక్కరూ లేరు. చంద్రబాబు నగరంలోనే ఉన్నప్పటికీ వెళ్లలేని స్థితిలో సచివాలయంలో సమీక్షలు నిర్వహించారు. రాష్ట్రపతి గత ఆగస్టు 2న నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవానికి వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయన విమానం దిగినప్పుడు సైనికాధికారి, గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నిల్చున్నారు.
ఇప్పుడు అలాంటి అవకాశం కూడా లేదు. బేగంపేట విమానాశ్రయం రాజధాని ప్రాంతమైన జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉంది. దాంతో తెలంగాణ సీఎంకు తొలి ప్రాధాన్యం ఇస్తే ఏపీ సీఎంకి తదుపరి ప్రాధాన్యం కల్పించారు. ఈసారి ప్రణబ్ హకీంపేటలో దిగారు. ఇక్కడ చంద్రబాబుది పొరుగు రాష్ట్ర సీఎం హోదా అవుతుంది.
మంగళవారం బొల్లారంలోని రాష్ట్రపతి విడిదికి వెళ్లి ప్రణబ్‌ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఉమ్మడి రాజధాని అయినందున జీహెచ్ఎంసీలో చంద్రబాబుకు ఆ హోదా ఉంటుంది. బొల్లారం జీహెచ్ఎంసీ పరిధిలో లేనందున పక్క రాష్ట్ర సీఎం అవుతారు.












Click it and Unblock the Notifications