విజయవాడ మెట్రోకు 12 వేల కోట్లా ? నాలుగోవంతు పెడితే ఇవన్నీ-కేశినేని మళ్లీ..!
విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టును తెరకెక్కించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై మాజీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) ఇవాళ మరోసారి ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు కోసం పెట్టే భారీ ఖర్చును విమర్శిస్తూ ఆయన పోస్ట్ పెట్టారు. అలాగే ఇందులో నాలుగో వంతు పెడితే విజయవాడ ఎలా మారిపోతుందో కూడా వివరించారు. ప్రస్తుత లెక్కల బట్టి విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఖర్చు రూపాయలు 12వేల కోట్లు అని ప్రభుత్వం చెబుతోందని, ఇది పూర్తి అవటానికి సుమారు 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుందన్నారు. అప్పటికి దాని వ్యయం కచ్చితంగా రెట్టింపై 24 వేల కోట్లకు పెరుగుతుందన్నారు.
విజయవాడ నగరం ఒక్క చక్కటి నివాస యోగ్యమైన నగరంగా చేయటానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలైనటువంటి
24/7 సురక్షితమైన తాగునీరు, నాణ్యమైన, గుంతలు లేని రహదారులు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, వర్షపు నీటి పారుదల, వరద నివారణ, నిరంతర విద్యుత్ సరఫరా, వీధి దీపాలు, పరిశుభ్రత, చెత్త సేకరణ-శుద్ధి, సురక్షితమైన కాలిబాటలు, మెరుగైన ప్రజా రవాణా, ప్రభుత్వ ఆసుపత్రులు, అత్యవసర వైద్యసేవలు, నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలలు, ఉద్యానవనాలు, ఆటస్థలాలు, ట్రాఫిక్ నిర్వహణ, వాహన నిలుపుదల సదుపాయాలు, ప్రజా మరుగుదొడ్లు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు అనుకూలమైన సదుపాయాలు, ప్రజా భద్రత, అగ్నిమాపక-అత్యవసర సేవలు, పచ్చదనం, కాలుష్య నియంత్రణ వంటి వాటిపై ప్రాజెక్టులో 25 శాతం ఖర్చుపెడితే సరిపోతుందన్నారు.

ఇలా మెట్రో రైల్ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 25 శాతం వెచ్చించి అందమైన, అన్ని వర్గాల వారికి ఆమోదకరమైన నివాస యోగ్యకరమైన సుందర విజయవాడగా తయారు చేసుకోవడం సబబా లేక మెట్రో రైల్ ప్రాజెక్ట్ చేయడం సబబా అని కేశినేని నాని ప్రశ్నించారు. నిన్న పెట్టిన మరో ఫేస్ బుక్ పోస్టులో కేశినేని నాని.. మెట్రో రైల్ ప్రాజెక్టు విజయవాడకు వరమా లేక శాపమా అని ప్రశ్నించారు. దీంతో మెట్రో రైల్ ప్రాజెక్టుపై పూర్తి స్ధాయిలో పోరాటానికి కేశినేని నాని సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన సోదరుడు, ఎంపీ కేశినేని చిన్ని అవినీతిపై సీఎం చంద్రబాబుతో పాటు సీబీఐ, ఈడీలకు సైతం ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో ప్రస్తుతం ఆయన మరో కొత్త దారి ఎంచుకున్నట్లు తెలుస్తోంది.














Click it and Unblock the Notifications