టీడీపీకి షాకిచ్చిన ఎంపీలు: ఉన్న ముగ్గురిలో ఇద్దరు అవుట్
Kesineni Nani: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు ఆ పార్టీకి మింగుడు పడట్లేదు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తోన్న ధోరణి- సీనియర్లను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. పార్టీని వీడి బయటికి వెళ్లిపోయేలా చేస్తోంది.
కేశినేని నాని తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి తలెత్తడం దీనికి నిదర్శనం. ఇది ఆయనతో ఆగేలా కనిపించట్లేదు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు సీనియర్ నేతలను కూడా ఆయన తన వెంట పార్టీ నుంచి బయటికి తీసుకెళ్లొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. విజయవాడ టీడీపీ యువ నాయకురాలు కేశినేని శ్వేత పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికీ గుడ్‌బై చెప్పారు.

ఈ పరిస్థితుల్లో కేశినేని రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?, ఆయన అడుగులు ఎటు పడొచ్చనే విషయం చర్చనీయాంశమైంది. ఇంకో రెండు నెలల్లో ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేశినేని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉత్కంఠత రేపుతోంది. టీడీపీకి గుడ్‌బై చెప్పిన ఆయన కుటుంబం.. ఏ పార్టీలో చేరొచ్చనేది ఆసక్తి రేపుతోంది.
విజయవాడ లోక్‌సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా వరుసగా రెండుసార్లు గెలిచారాయన. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని తట్టుకుని మరీ విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రసాద్ వీ పొట్లూరిపై 8,726 ఓట్ల స్వల్ప తేడాతో నెగ్గారు.
ఇప్పుడు వాతావరణం మారిపోయింది. కేశినేని నానిని దూరం పెట్టింది టీడీపీ. ఈ సారి ఆయనకు టికెట్ ఇవ్వట్లేదని తేల్చి చెప్పింది. తనకు తానుగా టీడీపీ నుంచి బయటికి వెళ్లిపోయే పరిస్థితిని కల్పించింది. ఫలితంగా ఆయన టీడీపీకి రాజీనామా చేయడం లాంఛనప్రాయమే అయింది.

వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై కేశినేని శ్వేత క్లారిటీ ఇచ్చారు. కేశినేని నాని మూడోసారి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారని తేల్చి చెప్పారు. మళ్లీ లోక్‌సభలో అడుగు పెడతారంటూ ధీమా వ్యక్తం చేశారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఇంకొద్ది రోజుల్లో తేలిపోతుందని అన్నారు.
తమ అనుచరులు, అభిమానులతో కేశినేని నాని త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని, ఏ పార్టీలో చేరాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటారని శ్వేత చెప్పారు. ఇప్పుడున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే- నాని వైఎస్ఆర్సీపీ వైపే అడుగులు వేయడం ఖాయంగా కనిపిస్తోంది.
అటు- గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈ సారి పోటీ చేయట్లేదు. తాను ఎన్నికలకు దూరంగా ఉంటానంటూ ఆయన ఇదివరకే పార్టీ అగ్రనాయకత్వానికి సందేశాన్ని పంపించారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. వ్యాపార కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని భావిస్తోన్నారు జయదేవ్.












Click it and Unblock the Notifications