ఏపీలో కొత్త జిల్లాలపై తాజా ట్విస్ట్..! వీటిపై అభ్యంతరం..! త్వరలో క్లారిటీ..!
ఏపీలో జిల్లాల పునర్విభజనపై ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కసరత్తు చేస్తున్న కూటమి సర్కార్ కు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై సిఫార్సులు చేసేందుకు నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ మరోసారి సమావేశమైంది. ఈ భేటీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ఓ విషయంలో మాత్రం మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ వచ్చిన ప్రతిపాదనల్లో వేటిని ఆమోదించాలి, వేటిని తిరస్కరించాలన్న దానిపై ఈ అభ్యంతరం కీలకంగా మారబోతోంది.
జిల్లాల పునర్ వ్యవస్ధీకరణపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ఇప్పటివరకూ వచ్చిన కొత్త జిల్లాల ప్రతిపాదనలపై చర్చించారు. ఇందులో మదనపల్లి, మార్కాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాలకు ఆమోద ముద్ర పడిన నేపథ్యంలో మిగిలిన వాటిపై చర్చించారు. వీటిలో 7-8 కొత్త జిల్లాలున్నాయి. అయితే వీటి ఏర్పాటు విషయంలో మంత్రుల కమిటీ ఉమ్మడిగా ఓ అభిప్రాయం వ్యక్తం చేసింది. మరీ చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తే ఆశించిన ప్రయోజనం దక్కదని మంత్రులు అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం కృష్ణాజిల్లాలో ఉన్న నూజివీడు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోనూ, ఏలూరు జిల్లాలో ఉన్న కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణాజిల్లాలో కలిపే ప్రతిపాదనలపై చర్చించారు. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్లుగా అద్దంకి, గిద్దలూరు, మడకశిరను ఏర్పాటు చేయడంపై రూట్ మ్యాప్ ఖరారు చేశారు. మరోవైపు అల్లూరి జిల్లా కేంద్రం దూరమైనందున ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు చేసిన సూచనపై మంత్రులు చర్చించారు. దీంతో పాటు పోలవరం ముంపు మండలాలు ఏ జిల్లాలో కలపాలన్న దానిపైనా చర్చించారు.

ఇవాళ జరిగిన భేటీలో మంత్రులు కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్ల ప్రతిపాదనలపై చర్చించినా అన్ని విషయాల్లో ఏకాభిప్రాయం రాలేదని సమాచారం. దీంతో మరోసారి సమావేశమై వీటిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. అనంతరం సీఎం చంద్రబాబుకు మంత్రుల కమిటీ నివేదిక ఇస్తుంది. దీని ఆధారంగా చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications