హతమైన ఉగ్రవాదుల టార్గెట్ ఈ నగరాలే: సంగారెడ్డిలో అద్దెకు ఇల్లు
హైదరాబాద్: నల్లగొండ జిల్లా జానకీపురం ఎన్‌కౌంటర్‌లో హతమైన సిమీ ఉగ్రవాదులు ఐజాజ్, అస్లామ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని మూడు నగరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. వారి కార్యకలాపాలకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఏప్రిల్ 1వ తేదీన హైదరాబాదులో బస్సు ఎక్కి విజయవాడకు బయలుదేరిన ఆ ఇద్దరు ఉగ్రవాదులు నల్లగొండ జిల్లాలోని సూర్యాపేటలో పోలీసులపైకి కాల్పులు జరిపి పారిపోయి, ఆ తర్వాత జానకీపురం ఎదురు కాల్పుల్లో హతమైన విషయం తెలిసిందే. వారిద్దరు కూడా సంగారెడ్డిలో ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్దించారని వార్తలు వస్తున్నాయి.
సంగారెడ్డి కేంద్రంగా సిమీ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు నగరాలను, తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ పట్టణాన్ని లక్ష్యాంగా చేసుకుని దాడులు చేయాలని పథకం వేశారని దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు.

స్థానికంగా ఓ కర్మాగారంలో పనిచేస్తున్నట్లు చెప్పి అస్లాం, ఐజాజ్ సంగారెడ్డిలో అద్దెకు ఇల్లు తీసుకున్నట్లు ఇంటి యజమాని ద్వారా దర్యాప్తు అధికారులకు తెలిసిందని అంటున్నారు. ఏప్రిల్ 1వ తేదీన హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన వారిద్దరు అంతకు ముందు మార్చి 28 నుంచి 30వ తేదీ వరకు విజయవాడలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ తర్వాత మరో ఇద్దరు వారికి జత కూడేవారని అంటున్నారు.












Click it and Unblock the Notifications