పిచ్చికూతలొద్దు, గవర్నర్ ఎవరు: కిరణ్, హరీష్ ఆగ్రహం
హైదరాబాద్: తన పైన వచ్చిన అవినీతి ఆరోపణల పైన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం తీవ్రంగా స్పందించారు. ఎవరైనా పిచ్చికూతలు కూయవద్దని, కోర్టులకు వెళ్లవచ్చునని సూచించారు. రానున్న ప్రజాస్వామ్య ప్రభుత్వం తన నిర్ణయాలను తిరగదోడవచ్చునని కానీ, తన నిర్ణయాలను తిరగదోడేందుకు గవర్నర్ ఎవరని ప్రశ్నించారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ మధ్యాహ్నం కిరణ్ పైన తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
తన రాజకీయ జీవితం, ముఖ్యమంత్రి పదవి తెరిచిన పుస్తకమన్నారు. తన పైన అవినీతి ఆరోపణలు చేసేవారు వాటిని నిరూపించాలన్నారు. తాను పాలనలో పారదర్శకతను తీసుకు వచ్చానని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఉంటే చర్యలు తీసుకోవచ్చునని సవాల్ చేశారు.

తాను తీసుకున్న నిర్ణయాలపై తిరగదోడేందుకు గవర్నర్ ఎవరని, రానున్న ప్రజాస్వామ్య ప్రభుత్వం తిరగదోడవచ్చునని చెప్పారు. తన నిర్ణయాల పైన ఎలాంటి విచారణ జరిపినా తాను భయపడే ప్రసక్తి లేదన్నారు. సిఎంగా నేను తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే విచారణ జరిపించుకోవచ్చునని చెప్పారు.
ఎలాంటి విచారణలు జరిపినా భయపడనని చెప్పారు. ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయ జీవితంలో ఉందని, ఒక్క మచ్చ కూడా తెచ్చుకోలేదన్నారు. తాను కూడా తన రాజకీయ జీవితంలో మచ్చ తెచ్చుకోలేదని చెప్పారు. ఎవరైనా పిచ్చి కూతలు కూయవద్దన్నారు. కోర్టులో కేసులు వేసుకొని, తనకు నోటీసులు ఇవ్వవచ్చునని సూచించారు.
తన జీవితంలో మచ్చ తెచ్చుకునే పనులు చేయలేదన్నారు. తన పైన కోర్టులలో కేసులు వేసుకోవచ్చునని, గవర్నర్‌కు ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు. తాను అనేక భూకేటాయింపులు రద్దు చేశానని చెప్పారు. నాలుగైదు నెలలు కాదని, అవసరమైతే మూడేళ్ల నుండి తిరగదోడవచ్చునని, ఇక్కడ భయపడే వాళ్లెవరు లేరన్నారు. తాను భయపడే సమస్యే ఉండదన్నారు.
తాము తమ పార్టీ విధానాలు నచ్చే వారికి ఆహ్వానం పలుకుతున్నామన్నారు. జర్నలిస్టులను కూడా పోటీలో నిలిపే ఆలోచన ఉందని చెప్పారు. తమది కొత్త పార్టీ అని, మీడియా సహకారం కావాలని కోరారు. తమది సామాన్య ప్రజల పార్టీ అన్నారు. కాగా, ఈ సమావేశంలో హర్ష కుమార్, లగడపాటి రాజగోపాల్, పితాని సత్యనారాయణ తదితరులు ఉన్నారు. శైలజానాథ్ అమెరికా వెళ్లినందువల్ల రాలేదు. రాయపాటి సాంబశివ రావుకు ఆలస్యమైంది. కాగా, లగడపాటి రాజగోపాల్‌ను రాజకీయ సన్యాసం చేయవద్దని కోరుతున్నట్లు చెప్పారు.
ఆయన పొరుగు రాష్ట్రం వారు: హరీష్ రావు
కిరణ్ కుమార్ రెడ్డి పొరుగు రాష్ట్రం వ్యక్తి అని, ఆయన పార్టీతో తమకు ఎలాంటి నష్టం లేదని తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కిరణ్ చివరన ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని వాటిపై గవర్నర్‌ను కలవనున్నామని చెప్పారు. కిరణ్ అవినీతి చిట్టా తమ వద్ద ఉందన్నారు.
ఏ ముఖంతో: మైసూరా
కిరణ్ కుమార్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని కొత్త పార్టీ పెడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత మైసూరా రెడ్డి ప్రశ్నించారు. విభజన కారకుడు కిరణే అని ఆరోపించారు. కిరణ్ ఇచ్చిన రూట్ మ్యాప్ ఆధారంగానే విభజన జరిగిందన్నారు.












Click it and Unblock the Notifications