తెలుగు వారి చరిత్ర తవ్వుతున్న కిరణ్!: స్పీచ్‌పై కసరత్తు
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన సుదీర్ఘంగా మాట్లాడేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధమవుతున్నారట. ఈ నెల 21వ ఆయన సభలో ప్రసంగించే అవకాశముంది. సమైక్య రాష్ట్రంతో ఇరు ప్రాంతాలకు కలిగే ప్రయోజనాలను సభలో ఆయన చెప్పనున్నారు. విభజన బిల్లుపై సభలో తన ప్రసంగం కోసం కిరణ్ భారీ కసరత్తు చేస్తున్నారు.
వీలైనంత సమగ్రంగా చర్చించేలా అందుకు అవసరమైన సమాచారాన్ని ఆయన సిద్ధం చేసుకున్నారట. విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కిరణ్ తన వాదనను పకడ్బందీగా, సమర్థంగా సభలో వినిపించాలని భావిస్తున్నారు. ఇందుకోసం బిల్లుపై ఆరు రోజుల క్రితం అధ్యయనం ప్రారంభించారట.

బిల్లులోని అంశాలు, వాటి పూర్వాపరాలపై సమాచారం తీసుకున్నారు. గతంలో జరిగిన ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల బిల్లులతో పాటు శాసన సభలో చర్చల వివరాల ప్రతులను కూడా సిఎం తెప్పించుకున్నారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై రాజ్యాంగపరమైన అనుకూలతలు, ప్రతికూలతలపై ఆయన నిపుణులతో చర్చిస్తున్నారు.
తెలుగు వారి చరిత్ర, 1956లో రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులకు సంబంధించిన వివరాలతో పాటు ప్రాంతాలవారీగా అభివృద్ధి, గణాంకాలు, వనరుల వివరాలు తెలుసుకుంటున్నారు. అలాగే అధిష్టానం వద్ద వినిపించిన వాదనల గురించి ప్రత్యేక నివేదికను సిద్ధం చేశారట. 17 నుండి 23 వరకు సభ జరగనుంది. దీంతో కిరణ్ 21న ప్రసంగించే అవకాశముందని అంటున్నారు. రాష్ట్రపతి పొడిగిస్తే మరికొద్ది రోజులు జరిగే అవకాశముంది.












Click it and Unblock the Notifications