టీపై ఢిల్లీ హీట్: అమీతుమీకి కిరణ్, బొత్స అక్కడే?
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై ఢిల్లీలో రాజకీయం మరోసారి వేడెక్కింది. జాతీయ భద్రతా మండలి (ఎన్ఐఎ) సమావేశానికి ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు అధిష్టానం పెద్దలను కలిసే అవకాశం ఉంది. ఆయన పార్టీ అధిష్టానం పెద్దల అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ఆయన సోమవారం కాంగ్రెసు అధిష్టానానికి చెందిన పలువురు నాయకులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమైక్యాంధ్రకు అనుకూలంగా వాదన వినిపిస్తూ వస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి అధిష్టానంతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడుతారని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గేందుకు ఏ మాత్రం కాంగ్రెసు అధిష్టానం సముఖంగా లేకపోగా, రాజీనామాలు చేసుకుంటే చేసుకోండని అధిష్టానం పెద్దలు సీమాంధ్ర నాయకులను హెచ్చరించడంతో పరిస్థితి తెగేదాకా వచ్చినట్లు చెబుతున్నారు. ఎనిమిది పార్లమెంటు సభ్యులు రేపు మంగళవారం తమ రాజీనామాలు ఆమోదింపజేసుకుంటారని భావిస్తున్నప్పటికీ ఇద్దరు ముగ్గురు వెనక్కి తగ్గే అవకాశాలున్నాయని అంటున్నారు.

కాగా, కిరణ్ కుమార్ రెడ్డి చివరిసారిగా తన సమైక్యాంధ్ర వాదనను వినిపించి, తాను తీసుకోబోయే చర్యల గురించి చెప్పే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో ఇప్పటికే 18 మంది రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ మంత్రులు, నాయకులు కూడా ఢిల్లీ బాట పట్టారు. తెలంగాణకు చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు.
తెలంగాణ నేతలు ఆంటోనీ కమిటీకి చెందిన కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీని, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిసే అవకాశం ఉంది. వారు హైదరాబాద్‌పై స్పష్టత కోరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24వ తేదీన కొంత మంది కేంద్ర మంత్రుల రాజీనామాలు ఆమోదం పొందిన తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం మరింత తీవ్రమవుతుందని ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అంటున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వరకు పోరాటం ఆగదని అంటున్నారు.












Click it and Unblock the Notifications