జగన్‌పై కత్తితో దాడి: మోహన్ బాబు, జీవీఎల్, విజయసాయి స్పందన, ‘పబ్లిక్‌లో ధైర్యం లేకే..’
న్యూఢిల్లీ: ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తేలాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. వైయస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతపైనే దాడి జరిగితే సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు.

పబ్లిక్‌లో దాడి చేసే ధైర్యం లేకనే..
పబ్లిక్‌లో దాడి చేసే ధైర్యం లేకనే ఎయిర్‌పోర్ట్‌లో వైయస్ జగన్‌పై దాడి చేశారని విమర్శించారు. ఒక ప్రణాళిక ప్రకారమే ఎయిర్‌పోర్ట్‌లో దాడి జరిగిందని అన్నారు. వైయస్ జగన్‌పై జరిగిన దాడిని ప్రేరేపించి చేసినటువంటి కుట్రగా ఆయన అభిప్రాయపడ్డారు. సినిమాలు లేని నటుడు ఆపరేషన్లంటూ జోస్యాలు చెబుతున్నారని శివాజీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అందులో బాబే నెం.1
‘వైయస్ జగన్‌పై జరిగిన దాడిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించాలి. ఎవరి ప్రేరణతో దాడి జరిగిందో విచారణ జరిపించాలి. టీడీపీ నేతలు మాట్లాడే తీరు.. పూర్తిగా మాఫియా మాట్లాడినట్టుగా ఉంది. ఈ ఘటనపై చంద్రన్న ఇన్వెస్టిగేషన్ కాకుండా.. న్యాయ విచారణ జరిపించాలి. తప్పుడు ప్రచారం చేయడంలో చంద్రబాబు ప్రపంచంలోనే నంబర్ వన్. హింసా రాజకీయాలు ఎవరికీ మంచివి కావు' అని జీవీఎల్ నర్సింహారావు హితవు పలికారు.

బాధాకరమంటూ మోహన్ బాబు
జగన్మోహన్ రెడ్డి జరిగిన హత్యాయత్నాన్ని ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. మానవత్వం ఉన్న మనిషిగా ఈ ఘటనపై స్పందిస్తున్నట్టు తెలిపారు. ప్రజల మేలు కోరి 12 జిల్లాలు తిరిగి.. ఇంకా తన ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్న ఓ నాయకుడికి ఇలా జరగడం బాధకరమని అన్నారు. తెలుగు ప్రజల ఆశీస్సులతో వైయస్ జగన్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారని అన్నారు. పెన్ను కూడా తీసుకువెళ్లలేని ఎయిర్‌పోర్ట్‌లోకి కత్తి ఎలా తీసుకెళ్లారు అని ప్రశ్నించారు. కత్తి తీసుకెళ్లమని నిందితుడిని ప్రోత్సహించిన వారెవరో తేలాలని అన్నారు.

ఐదు నిమిషాల్లో పోస్టర్లు తయారు చేయొచ్చు..
పోటీ మనస్తత్వం ఉండాలని.. అభిమాని పేరుతో ఎవరు ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడరని మోహన్ బాబు పేర్కొన్నారు. ఐదు నిమిషాల్లో ఎటువంటి పోస్టర్లయినా తయారు చేయవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలని టీడీపీ నేతలను ఉద్దేశించి అన్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్పడం అందరి బాధ్యత అని సూచించారు. వైయస్ జగన్‌పై దాడి కలలో కూడా ఊహించని ఘటన అని తెలిపారు. ఆయనపై జరిగిన దాడి తప్పని చాలామంది టీడీపీ మిత్రులు ఫోన్ చేసి చెప్పారని వెల్లడించారు. ధర్నాలు, ఆందోళనలు, బస్సులపై దాడి చేయడం వైయస్ జగన్‌కు ఇష్టం ఉండదని అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని తన అభిమానులకు చెప్పినట్టు తెలిపారు.

కుట్రను నీరుగార్చేయత్నం
జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన వ్యక్తి ఆయన అభిమానే అని టీడీపీ నేతలు, పోలీసులు చెప్పడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ ద్వారా తప్పుబట్టారు. పబ్లిసిటీ కోసమే దాడి జరిగిందని చెప్పడాన్ని ఖండించారు. ఎయిర్‌పోర్టులో జరిగింది కాబట్టి అది పోలీసుల బాధ్యత కాదని టీడీపీ నేతలు చెప్పడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలన్నారు. హత్యాయత్నం ఘటనపై విచారణ చేయకముందే ఏపీ డీజీపీ చేసిన వ్యాఖ్యలతో కుట్రను నీరుగార్చే ఉద్దేశం స్పష్టమవుతోందని వెల్లడించారు.

భద్రత పెంచమన్నా.. పట్టించుకోలేదు..
వైయస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన ఎయిర్‌పోర్టు తమ పరిధిలోనికి రాదని డీజీపీ చెప్పారు.. మరి ప్రత్యేక హోదా ర్యాలీ కోసం వైఎస్ జగన్ విశాఖపట్నం వెళ్తున్నప్పుడు ఆయన ఎయిర్‌పోర్టు రన్‌వే వద్ద మఫ్టీ పోలీసులు బయటకు రాకుండా ఎలా అడ్డుకున్నారని ప్రశ్నించారు. అది మీ పరిధి కాదని అప్పుడు పోలీసులకు తెలియలేదా? అని సూటిగా అడిగారు. వైయస్ జగన్ భద్రత, రక్షణ చర్యలను మరింత పటిష్టం చేయాలని, గతంలో చేసిన అనేక విజ్ఞప్తులను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. చివరకు ఆయన ప్రయాణించే వాహనాలు సైతం తరచుగా మరమ్మతులకు గురవుతున్నా, మొరాయిస్తున్నా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం వెనక ప్రభుత్వ ఉద్దేశం ఇదేనా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications