మాఫీ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా: కోడాలి సవాల్
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా పేదలకు ఒక్క ఇంటికి కూడా రుణం ఇవ్వలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. పేదల కోసం వైయస్సార్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
పులిచింతల ప్రాజెక్టు ఘనత వైఎస్ రాజశేఖరెడ్డిదేనని, ఇప్పుడు పులిచింతల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తైతే వైయస్సార్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేదన్నారు. ఆయన చనిపోయిన రోజే పోలవరం ప్రాజెక్టు చచ్చిపోయిందని అన్నారు.

పోలవరం చెడగొట్టడానికే పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టారని ఆరోపించారు. రుణాలు మాఫీ కాకుండానే సన్మానాలు చేయించుకుంటున్నారని, ఒక్క మహిళకు రుణమాఫీ చేసినట్టు నిరూపిస్తే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. విభజన చట్టం ప్రకారం రాజధానిని కేంద్రం నిర్మించాలన్నారు. కేంద్రం నిర్మిస్తే తమకేమీ రాదన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తామంటోందని ఆరోపించారు.
గొంతు నొక్కేస్తున్నారు: చెవిరెడ్డి
ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని ఎండగడతామనే... ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ గొంతును బలవంతంగా నొక్కేస్తుందని వైయస్సార్ కాంగ్రె పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు.
సిఎం చంద్రబాబు నాయుడును నమ్మి ఓట్లు వేసినందుకు లక్షలాది మంది యువత అన్యాయమై పోయారని అన్నారు. యువత ఓట్లతో చంద్రబాబు, ఆయన అనుచరవర్గం మాత్రమే బాగుపడిందని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications