కూటమి సర్కార్లోనూ కొడాలి నాని హవా ? టీడీపీ ఎమ్మెల్యేలకు షాకులు.. !
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎంగా ఉన్న జగన్ మొప్పు కోసం చంద్రబాబు, లోకేష్ సహా టీడీపీ నేతలందరిపైనా నిత్యం బూతులతో రెచ్చిపోయిన గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా తన హవా కొనసాగిస్తున్నారా అంటే టీడీపీ నేతల నుంచి అవుననే సమాధానం వస్తోంది. తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీల్లో కొడాలి నాని ప్రస్తావన వచ్చినప్పుడు వీరంతా బయటపడ్డారు.
తాజాగా ప్రభుత్వం ఐపీఎస్ ల బదిలీల్లో భాగంగా కృష్ణాజిల్లా ఎస్పీగా ఆర్ గంగాధర్ ను నియమించింది. గతంలో అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు అంగళ్లు దాడుల కేసులో చంద్రబాబును ఏ1గా పెట్టి కేసులు నమోదు చేసి హైకోర్టులోనూ బెయిల్ ను అడ్డుకున్న ఎస్పీ గంగాధర్ ఇప్పుడు టీడీపీకి కీలకమైన కృష్ణాజిల్లాలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అంతే కాదు ఆయనకు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానితోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. ఇదంతా తెలిసీ ప్రభుత్వం ఆయనకు జిల్లా ఎస్పీగా బాధ్యతలు ఇచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎస్పీ ఆర్ గంగాధర్ ను సాధారణ బదిలీల్లో భాగంగానే కృష్ణాజిల్లాకు తెచ్చారని భావించినా మాజీ మంత్రి కొడాలి నానితో ఆయన ఈ ప్రభుత్వంలో దూరంగా ఉండక తప్పని పరిస్ధితి. కానీ తాజాగా కొడాలి నాని పీఏ లక్ష్మోజీపై దాడి జరిగింది. దీంతో లక్ష్మోజీ వద్దకు వెళ్లి ఎస్పీ పరామర్శించి వచ్చారట. దీంతో ఎస్పీ గంగాధర్ ఇంకా కొడాలి నాని ప్రభావంతోనే పనిచేస్తున్నారా అన్న అనుమానాలు టీడీపీ ఎమ్మెల్యేల్లో కలుగుతున్నాయి. ఇదే విషయాన్ని నిన్న అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీల్లో గత ప్రభుత్వంతో అంటకాగిన వారికే ప్రాధాన్యం దక్కుతుందని టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్న వేళ ఇది మరో ఉదాహరణగా నిలిచింది.












Click it and Unblock the Notifications