ఆనాడే తెలుసు, ముందే ఊహించా: రాజకీయ నేతలపై కోదండరామ్

జనవరి 10, 11 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ విద్యావంతుల వేదిక 5వ రాష్ట్ర మహాసభలకు సంబంధించి సన్నాహక సమావేశంలో ఆయన శుక్రవారంనాడు ప్రసంగించారు. తన జీవితం మొత్తం తెలంగాణ అభివృద్ధికి అంకితమని చెప్పారు. తాము తెలంగాణ కోసమే పోరాటం చేశామని, నాయకుల కోసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యమ సమయంలో తనకెదురైన ఓ అనుభవాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజుల్లో ఓ సంఘటన జరిగిందని, ఒక రోజు మధ్యాహ్నం నాతో మాట్లాడడానికి ఓ పెద్దాయన మా ఇంటికి వచ్చారని, వచ్చీరాగానే తనను తిట్టడం మొదలు పెట్టారని చెబుతూ ‘మీరంతా నాయకులకు వత్తాసుపలుకుతున్నారు. వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఉద్యమాన్ని రాజకీయం చేస్తున్నారు.' అని ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. ఆయన మాటలు ప్రశాంతంగా విన్న తాను ఆయనకు ఒకటే మాట చెప్పానని, తాము పోరాటం తెలంగాణ రాష్ట్రం కోసం తప్ప నాయకుల కోసం కాదని చెప్పినట్లు కోదండరామ్ తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ నాయకులు ప్రభుత్వాధినేతలైతే తమను దగ్గరకు కూడా రానివ్వరని, గడపకూడా తొక్కనివ్వరు అని చెప్పానని వివరించారు. దీంతో ‘భవిష్యత్తు గురించి తెలిసిన నీకు ఇంకేం చెప్పాలి' అంటూ ఎంతో కోపంతో వచ్చిన ఆయన ఏమీ అనలేక వెళ్లిపోయారని అన్నారు.
తెలంగాణ కోసం పోరాడినట్లే నేటి నుంచి తెలంగాణ అభివృద్ధి కోసం పోరాడుతామన్నారు. ఈ పాత్రకు తెలంగాణ మేధావులు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉద్యమం ప్రజాస్వామిక విలువల్ని ఆపాదించిందని వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాల, నాయకుల ఒత్తిళ్లకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆంధ్రా మీడియా తెలంగాణలో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలు, మహిళలపై జరుగుతున్న ఆత్యాచారాలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందో మేధావులు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చుక్కా రామయ్య అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించకుండా ఇక్కడ కూర్చొని ఉపన్యాసాలు ఇవ్వడం మేధావుల లక్షణం కాదని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు సాధించిన విజయంతో ఒకే ఒక్క మెట్టు ఎదిగామని ఇంకా ఎంతో ఎదగాల్సి ఉందన్నారు.












Click it and Unblock the Notifications