కోమటిరెడ్డి రాజీనామా వ్యవహారంలో కాక పుట్టిస్తోన్న చంద్రబాబునాయుడి పేరు
తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మనుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారన్న సంగతి తెలిసిందే. అయితే రాజగోపాల్ రాజీనామాపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంట్రాక్టుల కోసమే పార్టీ మారుతున్నారని, తల్లి లాంటి సోనియాగాంధీకి ద్రోహం చేశారంటూ ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
కోమటిరెడ్డి తన వ్యాఖ్యల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి పేరు ప్రస్తావించారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే రేవంత్ పనిచేస్తున్నారని, ఆయన వెనక బాబు ఉన్నారని ఆరోపించారు. టీడీపీలో భవిష్యత్తు లేకపోవడంవల్లే రేవంత్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాడన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందేనన్నారు. తర్వాత బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు కూడా రేవంత్‌పై మండిపడ్డారు. ఆయన కూడా చంద్రబాబు పేరు ప్రస్తావించారు. జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో రేవంత్ వెనక బాబు ఉన్నారన్నారు. మరో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మల్కాజిగిరి ఎంపీగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని రేవంత్ రెడ్డి గెలిచారని, తమతో కొట్లాడటంమాని కేసీఆర్ పై కోట్లాడాలని సూచించారు. అహంకారానికి గుర్తు కాంగ్రెస్ పార్టీ అని, అందుకే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలతో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకపోయినప్పటికీ తమ పార్టీ పేరు, అధినేత పేరు మార్మోగుతుండటంపై తెలుగు తమ్ముళ్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఏపీలో అధికారంలోకి రావడానికి బాబు తన ప్రయత్నాలు తాను చేస్తున్నారని, అయినప్పటికీ తెలంగాణ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ టీడీపీని కూడా జోడించి సెంటిమెంట్ రాజకీయం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు.