కొరటాల శివ, తారక్.. దేవరలో కారంచేడు ఘటన?
దర్శకుడు కొరటాల శివ తాను చేసే ప్రతి చిత్రంలోను సామాజిక అంశాన్ని చూపిస్తారు. శ్రీమంతుడులో ఊరిని దత్తత తీసుకోవడం, జనతా గ్యారేజ్ లో మొక్కల పెంపకం లాంటివాటిపై సందేశాలిచ్చారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవరలో కూడా మరో సామాజిక అంశాన్ని స్పృశిస్తున్నట్లు తెలుస్తోంది. 1985లో ఏపీలో ప్రకాశం జిల్లా కారంచేడులో దళితులపై అగ్రవర్ణాలవారు దాడిచేశారు. అత్యంత క్రూరంగా, హేయంగా జరిగిన ఈ దాడుల్లో ఎందరో దళితులు ప్రాణాలు కోల్పోయారు.
కారంచేడులో చోటుచేసుకున్న ఈ ఘటనను తాజాగా దేవరలో చూపించబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తివివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం తారక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటిసారి సోలో హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కావడంతో ఎన్టీఆర్ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ హీరోగా మారిన తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. కొరటాల గత చిత్రం ఆచార్య భారీ డిజాస్టర్ కావడంతో దేవరను తమ అంచనాలకు అనుగుణంగా కొరటాల చిత్రం చేస్తున్నారా? లేదా? అనే టెన్షన్ లో నందమూరి అభిమానులున్నారు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ తారక్ సరసన ఆడిపాడనుంది.
ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకున్న తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఇది కూడా పాన్ ఇండియా చిత్రంగానే తెరకెక్కనుంది. ఈలోగా ప్రశాంత్ నీల్ చిత్రం సలార్ విడుదలవుతుంది. ఆ సినిమా ఫలితాన్ని బట్టి మా హీరో సినిమాను అంచనా వేసుకుంటామంటున్నారు అభిమానులు.












Click it and Unblock the Notifications