కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు
ఏపీకి కేంద్రం అనేక ప్రాజెక్ట్ లను ఇస్తుంటే, ఆయా ప్రాజెక్ట్ ల పనులలో వేగం పెంచి ఏపీ ప్రభుత్వం దూసుకుపోతుంది. ముఖ్యంగా రైల్వే పనుల విషయంలో ఏపీలో గణనీయమైన పురోగతి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో రైల్వే లైన్ల పనులను ముమ్మరం చేసింది. కొత్త ప్రాజెక్టులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నవాటిని కూడా వేగవంతం చేస్తోంది.
ఊపందుకున్న కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్ పనులు
ఈ క్రమంలో గోదావరి ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్ పనులు ఇప్పుడు ఊపందుకున్నాయి. రూ.2,200 కోట్ల అంచనా వ్యయంతో 57.81 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం నిర్మాణం చేయబడుతుంది.పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం రూరల్, యలమంచిలి మండలాల గుండా ఈ రైల్వే లైన్ వెళుతుంది. ఈ రైల్వే లైన్ మొత్తం 8 మండలాలు, 25 గ్రామాలను కలుపుతూ సాగుతుంది.

కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్ కు భూసేకరణ పూర్తి
ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. అధికారులు యలమంచిలి మండలంలో 66 ఎకరాలు, నరసాపురంలో 53 ఎకరాలు సేకరించి రైతులకు పరిహారం అందజేశారు. ప్రస్తుతం రైల్వే లైన్ ప్రాజెక్ట్ కోసం సేకరించిన భూముల్లో హద్దులు గుర్తించేందుకు స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే నరసాపురం పెద్ద జంక్షన్ గా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ రైలు మార్గంలో అవసరమైన చోట్ల వంతెనల నిర్మాణం
ఈ రైలు మార్గంలో అవసరం అయిన చోట్ల వంతెనల నిర్మాణం కూడా కొనసాగుతోంది. చిన్న మామిడిపల్లి కాల్వ, పాలకొల్లు రోడ్డు వద్ద కొత్త బ్రిడ్జిలు రానున్నాయి. ఈ రైల్వే ప్రాజెక్ట్ అలైన్మెంట్ పై గతంలో కోర్టు స్టే విధించింది. అయితే అది ఇటీవల ఎత్తివేయబడింది. దీంతో భూసేకరణ పనులు మళ్ళీ తిరిగి ప్రారంభించి పూర్తి చేశారు. ఈ రైల్వేలైన్ పనులు పూర్తి అయితే కోనసీమ ప్రాంత ప్రజలకు రైళ్ళకోసం పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి.
అక్కడకు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే కోనసీమ వాసులకు రైలు సౌకర్యం
కాకినాడ, రాజమండ్రి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే రైలు సౌకర్యం కలుగుతుంది. అయితే మరో మూడేళ్ళలో పనులు అనుకున్నట్టు జరిగితే రైల్వే లైన్ పనులు పూర్తయ్యి రైళ్ళు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ఎన్నో ఏళ్ళ చిరకాల స్వప్నం అయిన ఈ రైల్వే లైన్ విషయంలో పనులు ముందుకు సాగటం ఆ ప్రాంత వాసుల ఆశలకు రెక్కలు వచ్చినట్టు అవుతుంది.












Click it and Unblock the Notifications