బంగ్లా, కారుకు కెటిఆర్ నో, ప్రతాప్ రెడ్డికి బాబు ప్రశంస
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రభుత్వం తనకు ఇచ్చిన కారను, బంగ్లాను నిరాకరించారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రులకు ప్రభుత్వం బంగ్లాలు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే తనకు ఇచ్చిన బంగ్లాతో పాటు కారును కూడా కెటిఆర్ నిరాకరించారు.
తన కారుపై మంత్రుల కార్లకు ఉపయోగించే ఎర్రబుగ్గ కూడా పెట్టుకోవద్దని నిర్ణయించారు. తనకు సంబంధించిన వ్యవహారాలాన్నింటిని ఇంటి నుండి చూస్తానని కెటిఆర్ చెప్పారు. నందినగర్‌లోని తన ఇంటిని కార్యాలయంగా చేసుకుంటున్నట్లు చెప్పారు. కాగా, ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటిఆర్ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
టార్గెట్ 2019
చంద్రబాబు తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు 2019ని టార్గెట్‌గా పెట్టుకున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చాకే సీమాంధ్రకు మకాం మారుస్తానని, పదేళ్లు ఇక్కడి నుండి సీమాంధ్రను పాలిస్తానని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తెలంగాణ ఇంఛార్జుల సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే. వారంలో ఒకరోజు తెలంగాణకు కేటాయిస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం టిడిపిదే అన్నారు.

తెలంగాణ నేతలకు, కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పారు. తెలంగాణలో అధికారం సాధించే వరకూ హైదరాబాద్‌ను విడిచిపెట్టేది లేదని, తెలంగాణలో టిడిపికి పూర్వవైభవం తెచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్‌కు మకాం మార్చేది.. అప్పటిదాకా ఇక్కడే ఉంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రస్తుతమున్న మూడు ప్రధాన రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోయిందని, మిగిలిన తెరాసతో తలపడడం కోసం టిడిపిని బలోపేతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నట్టు తెలిసింది.
తెలంగాణ సీఎంగా కెసిఆర్ ప్రమాణ స్వీకారం సందర్భంలో తనను ఆహ్వానించకపోయినా, తాను మాత్రం ఫోన్‌లో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఈ నెల 8న జరిగే తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ఆహ్వాన పత్రాన్ని పంపినట్టు చెప్పారు. తెలంగాణలో పార్టీ అభ్యర్థులకు లభించిన ఓట్లతో పాటు మిత్రపక్షమైన బిజెపికి వచ్చిన ఓట్లపై ఆయన ఆరా తీశారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించారు.
మెదక్ జిల్లా గజ్వేల్‌లో కెసిఆర్‌పై పోటీ చేసిన పార్టీ అభ్యర్థి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కార్యకర్తల సహకారంతో గట్టిపోటీ ఇచ్చినట్టు చెప్పారు. తెరాస ఆధిపత్యాన్ని నిలువరించేందుకు ప్రతాప్ రెడ్డి చేసిన ప్రయత్నాన్ని చంద్రబాబు ప్రశంసించారు. త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ సత్తా చూపుతుందని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు.












Click it and Unblock the Notifications