కర్నూలు దుర్ఘటన వెనుక భయంకర నిజాలు!: డ్రైవర్ లక్ష్మయ్య సంచలనం!!
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం.. 19 మంది అమాయక ప్రయాణీకుల జీవితాలను ఛిద్రం చేసింది. ఎంతో మంది కుటుంబాల్లో విషాదఛాయలను నింపింది. ఈ భయంకర దుర్ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతుండగా.. అనేక దిగ్భ్రాంతికరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం అంతకుముందు ఆ దారిలో ప్రయాణించిన ఇతర బస్సు డ్రైవర్ల అమానవీయ ప్రవర్తన.. ఈ ఘోర విషాదానికి ప్రధాన కారణాలు అని తెలుస్తోంది.
దుర్ఘటన వెనుక దాగున్న భయంకర నిజం!
కర్నూలు ప్రమాదానికి కారణమైన వేమూరి కావేరి బస్సు డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మయ్య పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం అతని నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలా కనిపిస్తోంది. "రోడ్డుపై పడి ఉన్న బైక్ నలుపు రంగులో ఉండటం వల్ల, చీకట్లో దూరం నుంచి దాన్ని సరిగా గుర్తించలేకపోయాను. వర్షం పడుతుండటంతో అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే బస్సు అదుపుతప్పి మరింత పెద్ద ప్రమాదం జరుగుతుందనే భయంతో బైకుపై నుంచి బస్సును పోనిచ్చాను" అని లక్ష్మయ్య చెప్పాడు.

అయితే కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన అత్యంత విస్మయకరమైన విషయం ఏమిటంటే.. లక్ష్మయ్య బస్సు రాకముందే ముగ్గురు (3) బస్సు డ్రైవర్లు రోడ్డుపై పడి ఉన్న ఆ నల్ల బైక్‌ను స్పష్టంగా చూశారు. వారు ప్రమాదాన్ని గుర్తించి దాని పక్కనుంచి జాగ్రత్తగా తమ బస్సులను పోనిచ్చారు. అయినా కూడా ఏ ఒక్క డ్రైవర్ కూడా దాన్ని రోడ్డుపై నుంచి తొలగించే ప్రయత్నం చేయలేదు! ఒకవేళ ఆ మూడు బస్సులలో ఏ డ్రైవర్ అయినా కాస్త మానవత్వం చూపించి, ఆ బైక్‌ను పక్కకు జరిపి ఉంటే.. ఈ ఘోరం తప్పేది. 19 మంది ప్రాణాలు నిలిచేవి. ఆ బైక్ నల్లని రంగులో ఉండటం డ్రైవర్‌కు సాకు కావచ్చు, కానీ మానవత్వం లేకపోవడం మాత్రం క్షమించరాని నేరం.
డ్రైవర్ భయం.. ప్రయాణికులకు ద్రోహం
డ్రైవర్ లక్ష్మయ్య తన బస్సును బైకుపై నుంచి పోనిచ్చిన వెంటనే బస్సు అడుగున మంటలు చెలరేగాయి. ఆ దృశ్యం చూసిన లక్ష్మయ్య.. వెంటనే బస్సును ఆపి, ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేయకుండా, భయంతో అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. మంటలు అంటుకున్న వెంటనే లక్ష్మయ్య కనీసం ప్రయాణికులకు అపాయం గురించి హెచ్చరించినా.. వారు అప్రమత్తమై బస్సు దిగి ప్రాణాలు రక్షించుకునేవారే. డ్రైవర్ లక్ష్మయ్య చర్య, అత్యాశతో కూడిన నిర్లక్ష్యం, బాధ్యతరాహిత్యం, పరారీని స్పష్టంగా సూచిస్తుంది.
సెల్‌ఫోన్ మిస్సింగ్.. పోలీసుల దర్యాప్తులో కొత్త ట్విస్ట్
ఈ దుర్ఘటనలో బస్సు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన బైకర్ శివశంకర్‌కు సంబంధించిన సెల్‌ఫోన్ మిస్ అవ్వడం పోలీసుల దర్యాప్తులో కొత్త మలుపు తిప్పింది. ప్రమాదం జరిగిన తర్వాత శివశంకర్ మృతదేహాన్ని రోడ్డు పక్కకు జరిపిన అతని స్నేహితుడు ఎర్రిస్వామి సెల్‌ఫోన్‌ను తీసుకువెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలం శివశంకర్ ఫోన్ లభించకపోవడంతో పోలీసులు అతని ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేశారు. అది రాంపల్లిలో ఎర్రిస్వామి వద్ద ఉన్నట్లు కనుగొని అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. శివశంకర్ ఆచూకీ, ఇతర వివరాలను ఎర్రిస్వామి ద్వారానే పోలీసులు తెలుసుకున్నట్లు సమాచారం. ఈ సెల్‌ఫోన్ మాయం వెనుక కారణాలు, ఎర్రిస్వామి ఉద్దేశం ఏమిటనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా ఈ రక్తపాత రహస్యాన్ని ఛేదించేందుకు పోలీసులు అనేక కోణాల్లో కూపీ లాగుతున్నారు.












Click it and Unblock the Notifications