రాజకీయాల్లో ఉండి లాభమేంటి?: ఏడ్చిన వార్తలపై కెవిపి
హైదరాబాద్: తాను ఏడ్చానన్న విషయమై కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావు గురువారం శాసన సభ లాబీల్లో స్పందించారు. తనకు ఆ పరిస్థితే ఉత్పన్నం కాదని చెప్పారు. ముప్పై మంది ఎమ్మెల్యేలను సంపాదించుకోకుంటే ఇన్నేళ్లుగా తాను రాజకీయాల్లో ఉండి లాభమేమిటని వ్యాఖ్యానించారు.
కాగా, కెవిపి రామచంద్ర రావు బోరున విలపించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బుధవారం కెవిపి మంత్రి గంటా శ్రీనివాస రావును కలిసి రెబల్ అభ్యర్థులను ఉపసంహరించకునేలా చూడాలని కోరారు. ఈ సమయంలో ఆయన కన్నీరు కార్చారట.

రాజ్యసభ ఎన్నికల బరిలో తిరుగుబాటు అభ్యర్థులుంటే అంతిమంగా నష్టపోయేదెవరో తెలుసా... అని గంటాను ప్రశ్నిస్తూ కెవిపి బిగ్గరగా ఏడ్చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలోని గంటా చాంబర్లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత గంటా చాంబర్‌కు కెవిపి వెళ్లారు. ఆయనతో పాటు మంత్రి దానం తదితరులు వెళ్లారు.
అప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులతో మంత్రి గంటా చర్చిస్తున్నారు. తన చాంబర్‌కు వచ్చిన కెవిపిని గంటా ఆహ్వానించారు. అక్కడే తిరుగుబాటు అభ్యర్థి చైతన్య రాజు కూడా ఉన్నారు. అంతలో ఆదాల ప్రభాకర రెడ్డి కూడా వచ్చారు. మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, శైలజానాథ్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తిరుగుబాటు అభ్యర్థుల పోటీ చర్చకు వచ్చింది. వారిని బరిలో నుంచి తప్పించాలని గంటాను కెవిపికోరారు.
దీంతో, వారు సమైక్య నినాదంతో బరిలోకి దిగారని తప్పుకోవాలంటూ వారిని తానెలా కోరతానని గంటా చెప్పారు. ఈ సమయంలో సమైక్య వాదంతో తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉంటే అంతిమంగా నష్టపోయేది ఎవరో తెలుసా అని గంటాను ప్రశ్నిస్తూ కెవిపి ఏడ్చేశారట.












Click it and Unblock the Notifications